బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన బబ్లీ కుమారి అందరిలానే ఓ సాధారణ మహిళ. తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె అయిన ఆమె ఇంటి పెద్దగా నిలవాలనుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 2015లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. బిహర్‌లోని ఖగారియా జిల్లాలో మొదటిసారి ఖాకీ దుస్తులు ధరించి విధుల్లో చేరింది. తర్వాత బెగుసరాయ్‌కు బదిలీ అయింది. నెలనెలా జీతంతో ఆమె కుటుంబ ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడింది.
అయినా.. అంతటితో ఆగిపోలేదు బబ్లీ కుమారి ప్రస్థానం. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కలగంది. ఇందుకోసం బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయలనుకుంది. పోలీస్ స్టేషన్లో విధులు, ఇంటి పనులు.. ఇలా అన్నీ పూర్తయ్యాక మిగిలిన కాస్త సమయాన్నే సద్వినియోగం చేసుకుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా పుస్తకం చేతబట్టేది. అలా బీపీఎస్సీ పరీక్షలు రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రస్తుతం బిహార్‌లోని బెగుసరాయ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బబ్లీ బీపీఎస్సీలో క్వాలిఫై అయినందున రాజ్‌గిర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకోనుంది. శిక్షణ కాలం ముగిసిన తర్వాత ఆమె బిహర్ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టనుంది.
బబ్లీ కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను బెగుసరాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ సన్మానించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే బీపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని కొనియాడారు. తనకు అండగా ఉండి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు బబ్లీ కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇదీ చదవండి:
డీఆర్డీఓకు కొత్త ఛైర్మన్, సతీశ్ రెడ్డికి కేంద్రంలో కీలక బాధ్యతలు
బిల్కిస్ బానో దోషుల విడుదలపై సుప్రీం నోటీసులు, ఈడీ అధికారాలపై సమీక్ష