బిహార్ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వివాదం సృష్టించారు. హిందుస్థాన్ పదంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉర్దూలో ప్రమాణం చేయడానికి లేచిన ఆయన.. రాజ్యాంగంలో సూచించిన హిందుస్థాన్ పదం బదులు భారత్ ఉండాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్.. ఈ డిమాండ్ లేవనెత్తారు. ఇది ప్రోటెం స్పీకర్ జీతన్ రాం మాంఝీకి కాస్త చికాకు తెప్పించింది. చివరకు భారత్ పదం ఉపయోగించేందుకు ఆయన అంగీకారం తెలిపారు.
దేశప్రజలంతా సాధారణంగా మాట్లాడే హిందుస్థాన్ పదంపై అభ్యంతరం ఎందుకని విలేకరులు ప్రశ్నించగా.. ఆ పదంతో తనకేం ఇబ్బంది లేదని బదులిచ్చారు ఇమాన్. 'రాజ్యాంగ ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన భారత్ పదాన్నే.. ఇక్కడా వాడాలని నేను సూచించా.' అని సమాధానమిచ్చారు.
ఎంఐఎం శాసనసభ్యుని వ్యాఖ్యలపై.. అధికార ఎన్డీఏ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.
హిందుస్థాన్ అనే పదం సాధారణ పరిభాషలోనిదేని.. కొందరు వేరే పదం ఉపయోగించాలని లేనిపోని వివాదాన్ని సృష్టించాలని చూస్తున్నట్లు జేడీయూ ఎమ్మెల్యే మదన్ సాహ్మీ ఆరోపించారు. హిందుస్థాన్ పదం పలకలేని వారు.. పాకిస్థాన్‌కు వెళ్లాలని ఎద్దేవా చేశారు భాజపా ఎమ్మెల్యే నీరజ్ సింగ్ బబ్లూ.
ఇదీ చూడండి: 'బిహార్ ఎన్నికల్లో 1197 మంది అభ్యర్థులకు నేరచరిత్ర'