Bihar man vaccine news: ఇప్పటివరకు దేశంలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు కరోనా టీకా తీసుకుని ఉంటారు? మొదటి, డోసు రెండో డోసు కలిపితే గరిష్ఠంగా రెండు సార్లు. అలాంటిది తాను 11 సార్లు టీకా తీసుకున్నట్లు ప్రకటించి బిహార్‌లోని మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని చెప్పారు. జిల్లాలోని ఉదకిషన్‌గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్.. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని తెలిపారు. అయితే అక్కడ టీకాల కార్యక్రమం ముగియడంతో 12వ డోసు పొందలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. పోస్టల్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన తొలి డోసు 13 ఫిబ్రవరి, 2021న తీసుకున్నారు. అప్పటి నుంచి డిసెంబరు, 2021 వరకు 11 డోసులు పొందారు. ఏయే తేదీల్లో టీకా తీసుకున్నదీ ఆయన రాసి పెట్టుకోవడం విశేషం.
ఈ సంగతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.
ఇదీ చదవండి: Weekend Curfew: ఆ రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ.. పాఠశాలలు బంద్