JDU MP Pintu Singh Extortion Case : వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను చూపించి ఓ మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తోందని జేడీయూ సీనియర్ నేత, సితామఢీ ఎంపీ సునీల్ కుమార్ పింటు ఆరోపించారు. రూ.2 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. మూడు వేరు వేరు నంబర్లతో తన వ్యక్తిగత ఫోన్‌కు కాల్ చేసి.. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే.. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించిందని అన్నారు. తనను బెదిరిస్తున్న మహిళ వెనుక ఇంకా చాలా మంది హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా.. తన పద్దతి మార్చుకోలేదని ఆరోపణలు చేశారు. దీనిపై శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎంపీ.
Sushil Kumar Pintu Extortion Case : అయితే ఎంపీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎడిట్ చేసినవిగా తెలుస్తోంది. కొందరు సైబర్ నేరస్థులు ఇంటర్నెట్ నుంచి సునీల్ కుమార్ పింటు ఫొటోలు తీసుకుని, వాటిని మోర్ఫింగ్ చేసి ఆయను బెదిరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శాస్త్రి నగర్ పోలీసులు తెలిపారు. ఎంపీ నంబర్‌కు బెదిరింపు కాల్‌లు వచ్చిన నంబర్‌లను బట్టి నిందితుల వివరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అందులో భాగంగా ఎంపీకి వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లు.. బిహార్ బయట నుంచి వచ్చాయని వెల్లడించారు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ఈ కేసులో విచారణ ముగిసిన అయిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. గతంలో లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లా పేరుతో వాట్సాప్ మెసేజ్ చేసి.. సైబర్ నేరస్థులు రూ. లక్ష డిమాండ్ చేశారని ఆరోపించారు.
ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తానని రూ. 10 కోట్లు డిమాండ్..
గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కుటుంబ రహస్య సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించారు. రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాజియాబాద్‌లోని వసుంధర కాలనీకి చెందిన రాజేష్ తన ఈ-మెయిల్ హ్యాక్ అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. హ్యాకర్లు తమ కుటుంబ కదలికలను గమనిస్తూ నిత్యం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ అన్షు జైన్ తెలిపారు.