Bihar Liquor Tragedy: బిహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీమద్యం తాగి 80 మందికి పైగా మృతి చెందిన కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రాంబాబు మహ్తోను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితుడు రాంబాబు.. బిహార్ నుంచి పరారై దిల్లీలోని ద్వారకలో తలదాచుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరించారు. రాంబాబు దిల్లీలో తలదాచుకున్నట్లు తమకు సమాచారం అందగా బిహార్ పోలీసులతో కలిసి అతడిని అరెస్ట్ చేసినట్లు దిల్లీ స్పెషల్ కమిషనర్ తెలిపారు.
సరన్ జిల్లాలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని మహ్తో పెద్ద ఎత్తున కల్తీమద్యం తయారు చేసి విక్రయించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు. అయితే నిందితులు.. హోమియోపతి మందులను ఉపయోగించి విషపూరిత లిక్కర్‌ను తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో తేలింది.
సరన్ జిల్లాలో కల్తీమద్యం తాగి వారాల వ్యవధిలోనే 80 మందికిపైగా చనిపోయారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. సీఎం నీతీశ్ కుమార్, భాజపా మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీమద్యం తాగి చనిపోయిన వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని నీతీశ్ తేల్చిచెప్పారు. తాగితే చనిపోవడం ఖాయమని ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికీ చాలా మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.