Bihar Liquor Death: బిహార్‌లో తీవ్ర కలకలం రేపిన కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు ముమ్మరమైంది. అదనపు ఎస్పీ సారథ్యంలో ముగ్గురు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు సహా 31 మందితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సారణ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే భయపడకుండా చెప్పాలని ప్రజలను కోరారు.
సారణ్ జిల్లా ఛాప్రా పట్టణంలో కల్తీ మద్యం తాగి 65 మందికిపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై సంబంధిత శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. గత 48గంటల్లో జరిపిన దాడుల్లో 126 మందిని అరెస్టు చేసి 4వేల లీటర్లకుపైగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.