పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి పురుషుల్లో కూడా మరింత అవగాహనను పెంపొందించాల్సిన అవసరం ఉందని బిహార్ ఉపముఖ్యమంత్రి రేణు దేవి అభిప్రాయపడ్డారు. అయితే రేణుదేవి చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఆ రాష్ట్రముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మాట్లాడిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. జనాభా నియంత్రణ అనేది పూర్తిస్థాయిలో స్త్రీలు అవగాహన ఉన్నప్పుడు సాధ్యమవుతుందని నితీశ్ ఇటీవల అన్నారు. అయితే అందుకు భిన్నంగా రేణుదేవి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సంతోనోత్పత్తి రేటును తగ్గించడానికి పురుషులకు అవగాహన కల్పించాలని రేణు దేవి అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించి పురుషుల్లో అనేక భయాలు ఉన్నాయని ఆమె తెలిపారు. బిహార్‌లో కేవలం ఒక్క శాతం మంది పురుషులే ఈ ప్రక్రియలో భాగమైనట్లు పేర్కొన్నారు.
"గర్భిణులకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలు చేకూర్చుతోంది. ఇవి కేవలం వారి భర్తలు వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకునిపోయినప్పుడే భార్యలకు అందుతాయి. కానీ ఎక్కువమంది పిల్లల్ని కనాలని వారి కుటుంబ సభ్యులు మహిళలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది కుటుంబంలో సభ్యుల సంఖ్యను అమాంతం పెంచుతోంది. పెరుగుతున్న జనాభాను నియంత్రించాలంటే స్త్రీ, పురుషుల మధ్య లింగ సమానత్వం అనేది ఉండాలి. ఇందు కోసం బాలబాలికల దశ నుంచే వారి మధ్య వివక్షతను అంతం చేయాల్సిన అవసరం ఉంది."
-రేణుదేవి, బిహార్ ఉపముఖ్యమంత్రి
కుటుంబ నియంత్రణ లక్ష్యాలను సాధించడానికి, పోషకాహార లోపం స్థాయిలను తగ్గించడానికి, అక్షరాస్యతను పెంపొందిచడానికి సమగ్ర కుటుంబ నియంత్రణలో అవసరం అని రేణుదేవి అన్నారు. వీటన్నింటినీ అమలు చేస్తే మొరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. జనాభ నియంత్రణపై ఉత్తర్‌ప్రదేశ్ తీసుకు రాబోయే చట్టం గురించి అడినప్పుడు ఈ విధంగా స్పందించారు.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో త్వరలోనే 'ఇద్దరు పిల్లల' నిబంధన!