మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యం పుంజుకుంటోంది. విషపు రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. తక్కువ ఖర్చుతో దిగుబడిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
సుభాష్ పాలేకర్‌ను ' వ్యవసాయ గురు' గా భావించి జీరో బడ్జెట్ సేద్యానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన ఎరువులు, కీటక నాశినిలకు బదులు సహజంగా తయారు చేసిన జీవామృతాలతో పంటకు బలాన్ని చేకూరుస్తున్నారు. ప్రకృతి సేద్యంలో జీవామృతం, బీజామృతం, అచ్చేధన, వాపస అనే సులభ పద్ధతులను అనుసరించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
"సుభాష్ పాలేకర్ గురు నుంచి నాకు ప్రేరణ కలిగింది. దీని పేరే జీరో బడ్జెట్. ఇందులో ఖర్చేమి ఉండదు. సేంద్రియ వ్యవసాయం అందరికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జిల్లా, గ్రామీణ స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి."
- విశ్వాస్ కడో, రైతు
ఆవు పేడ, గోపంచకం, బెల్లం, బురద, పిండి కలిపి తయారు చేసిన జీవామృత ఎరువుని పంటకు అందించి సేంద్రియ సాగు చేస్తున్నారు. పండిన ధాన్యంలోంచే విత్తనాలు తయారు చేసి బీజామృతంగా మారుస్తున్నారు. మృతకళేబరాలు వేసి భూ అచ్చేధనం చేసి భూసారాన్ని పెంచుతున్నారు. నీటిని ఒడిసిపట్టి నేలలో తేమను నిల్వ ఉంచే వాపస ప్రక్రియను ఆచరించి భవిష్యత్తు పంటలకు సులభ మార్గం నిర్మిస్తున్నారు.
"కొంత మంది ప్రకృతి సేద్యాన్ని పూర్తిగా అనుసరించకుండానే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. రసాయనిక సాగు జీరో బడ్జెట్ సాగు రెండూ కలిపి చేయకూడదు. ఒకసారి రసాయనాలు వదిలేశాక మళ్లీ వాడకూడదు. ఈ ఏడాది జీరో బడ్జెట్ చేసి రెండేళ్ల తర్వాత రసాయనాలు వాడితే శ్రమ వృధా అవుతుంది. అది పెంచిన భూసారాన్ని తగ్గించడమే అవుతుంది." -అశిష్ ఘాటోడ్, రైతు
ఇటీవలే ప్రభుత్వం జీరో బడ్జెట్ సేద్యాన్ని ప్రకటించినప్పటికీ అందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని రైతన్నలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లోకి జీరో బడ్జెట్‌ను తీసుకువెళ్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"మూడేళ్లుగా నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. ఇది నాలుగో సంవత్సరం. రసాయనాలు వాడకపోవడం వల్ల ఖర్చు చాలా తక్కువైంది. సేంద్రియ వ్యవసాయం గురించి పాఠ్య పుస్తకాల్లో పొందు పరచాలి. అప్పుడే అందరికీ తెలిసి ఫలితం దక్కుతుంది."_ప్రవీణ్ బరాయీ, రైతు
పాలేకర్ ప్రకృతి సేద్యాన్ని అనుసరించి మన రాష్ట్రంలోనే వరంగల్ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు గౌతమ్ అద్భుత దిగుబడిని సాధిస్తున్నా.. అవగాహన లేక ఎక్కువ మంది అనుసరించడంలేదు.
ఇదీ చూడండి: టీమిండియా పోరాట పటిమ అద్భుతం: మోదీ