ఇకపై మాస్క్ లేకుండా బయటికి రావద్దంటోంది ఉత్తర్ప్రదేశ్ సర్కార్. కరోనాపై పోరాటానికి ప్రతి పౌరుడికి మాస్కు అస్త్రాలు అందించనుంది. మేలైన ఖాదీ మాస్కులు రూపొందించి.. రాష్ట్రంలోని 23 కోట్ల ప్రజానికానికి చేరవేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
మేలైన మాస్కులు...
కరోనాను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన టీమ్-11తో సమావేశమయ్యారు సీఎం యోగి. ఈ సమావేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక పాత్ర పోషించే మూడు వరుసల ఖాదీ మాస్కులను తయారు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 66 కోట్ల మాస్కుల తయారీకి ఆదేశాలు జారీ చేశారు.
మాస్కుల తయారీ బాధ్యతను గ్రామీణ ఖాదీ పరిశ్రమలకు అప్పజెప్పింది ప్రభుత్వం. ఈ ఖాదీ మాస్కులు పలుమార్లు వినియోగించుకోవచ్చు. పైగా వైరస్ బారి నుంచి కాపాడేందుకు మార్కెట్లో లభించే పలుచటి మాస్కుల కంటే ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మాస్క్ తప్పకూడదు..
ఇకపై మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది యూపీ సర్కార్. అందుకే, త్వరలో ప్రతి పౌరుడికి రెండు ఖాదీ మాస్కులు చొప్పున అందించనుంది. ఈ మాస్కులను పేదలకు ఉచితంగా, మిగతావారికి అత్యంత తక్కువ ధరకు విక్రయించనుంది.
ఇదీ చదవండి:ఈ గొడుగు ఉంటే కరోనా మీ దరిచేరదు!