కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫాంలలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2015 జూన్ 21 నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని ఈసారి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది ఆయూష్ మంత్రిత్వ శాఖ. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్ ఫ్యామిలీ' వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.
యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్ కానుంది. ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇప్పటికే సందేశమిచ్చారు.
యోగా డే ముఖ్యాంశాలు..
- ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రసంగిస్తారు.
- ప్రసంగం అనంతరం 45 నిమిషాల పాటు యోగా సాధన కార్యక్రమంలో పాల్గొంటారు.
- 2015 నుంచి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
- లేహ్‌లో ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్రం భావించినప్పటికీ కరోనా కారణంగా రద్దయింది.
- విదేశాల్లోని భారతీయ సంఘాలు యోగా డేను డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
- 2014 డిసెంబరు 11న యోగా డేను అధికారికంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ. మోదీ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది
యోగాపై అవగాహన పెంచేందుకు పోటీలు..
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.
ఈ పోటీలను భారత్‌లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.
3 నిమిషాలు 3 ఆసనాలు
పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్‌ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.
యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.
భారత్‌లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.