కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తున్నట్లు భావిస్తున్న చ్యవాన్ ప్రాష్, పసుపు పాలు వంటి ఆయుర్వేద ఔషధాల వాడకాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వీటితో పాటు ములేతి పౌడర్, అశ్వగంధ, ఆమ్లా ఫ్రూట్లను వైరస్ నుంచి కోలుకున్న వారు ఉపయోగించవచ్చని సూచించింది.
వైరస్ నుంచి రికవరీ అయిన తర్వాత కూడా అలసట, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో కరోనా అనంతరం తీసుకోవాల్సిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
- మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్లు, భౌతిక దూరం నిబంధనలను పాటించాలి.
- ప్రతి రోజు తప్పనిసరిగా గోరు వెచ్చని నీటిని తాగాలి.
- చ్యవాన్ ప్రాష్, ఆయుష్ క్వాత్, పసుపు పాలు, సంషామణి వతి, గిలోయ్ పౌడర్, అశ్వగంధ, ఆమ్లా ఫ్రూట్, ములేతి పౌడర్, పసుపు, ఉప్పుతో కలిపిన గార్గ్లింగ్ వంటి రోగ నిరోధక శక్తి పెంచే ఆయుర్వేదిక్ ఔషధాన్ని వాడాలి.
- ఔషధం చట్టాలకు అనుగుణంగా అనుభవం పొందిన నిపుణులు సూచించిన వాటిని మాత్రమే ఉపయోగించాలి.
- రోజూ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయాలి.
- వైద్యులు సూచించిన శ్వాస వ్యాయామాలు కూడా చేయాలి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం పూట కొంత దూరం వేగంగా నడవాలి.
- పోషకాలతో కూడిన ఆహరం, అప్పుడే వండిన ఆహారం తీసుకోవాలి. దీని వల్ల భోజనం తర్వగా జీర్ణమవుతుంది.
- కోలుకున్న వ్యక్తి తగినంత నిద్ర పోవటం, విశ్రాంతి తీసుకోవటం ఎంతో అవసరం.
- వీరు ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి.
- వీటితో పాటు కొవిడ్ మందులను వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏయే మందులు వాడుతున్నారో ఆయుర్వేద నిపుణులకు తెలియజేయాలి.
- వైద్యుల సూచన ప్రకారం ఇంట్లో ఉంటూ ప్రతిరోజు శరీర ఉష్ణోగ్రతను, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిని, నాడీ స్పందనలు వ్యక్తిగతంగానే పర్యవేక్షించుకోవచ్చు.
- నిరంతరం పొడి దగ్గు, గొంతు నొప్పి ఉంటే ఆవిరి పీల్చాలి. వైద్యుల సూచనల మేరకు దగ్గు మందులు వాడాలి. ఎక్కువ జ్వరం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, భరించలేని ఛాతీ నొప్పి, నలతగా ఉండటం వంటిని అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- కరోనా బాధితుడు డిశ్చార్జి అయిన 7 రోజుల లోపు సదరు ఆసుపత్రి సిబ్బంది.. వ్యక్తిగతంగా కానీ, ఫోన్ ద్వారా అయిన రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలి.
- హోం ఐసోలేషన్లో ఉన్న వారు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి.
- పూర్తి ఆరోగ్యంగా అనిపిస్తే ముందుగా రోజువారీ ఇంటి పనులను ప్రారంభించండి. తర్వాత వృత్తి పరమైన పనిని తిరిగి ప్రారంభించవచ్చు.