మోదీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌధురీ విమర్శించారు. దేశంలో ఉన్న నేతలు కశ్మీర్లో పర్యటించకుండా అడ్డుకుని, విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్నారని మండిపడ్డారు.
కశ్మీర్లో వలస కూలీలను ఉగ్రవాదులు హత్య చేయడంపై తీవ్రంగా స్పందించారు అధీర్. బంగాల్ సాగర్డిఘీలోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. కూలీల హత్యకు కేంద్ర వైఖరే కారణమని ఆరోపించారు.
'కశ్మీర్ ప్రజలకు రక్షణ కల్పిస్తామని ఆగస్టు 5న పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ ప్రమాణం చేశారు. ఉగ్రవాదులను కశ్మీర్ నుంచి తరిమివేస్తామని చెప్పారు. కశ్మీర్లో అంతా సవ్యంగా ఉందని నిరూపించడానికి ఇప్పుడు ఐరోపా ప్రతినిధులను పిలిచారు. వారు ఇప్పుడు కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఎందుకంటే కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని ప్రపంచానికి మోదీ తెలియజేయాలని అనుకుంటున్నారు. కశ్మీర్లో పరిస్థితులు శాంతియుతంగా, సాధారణంగా లేవని ఉగ్రవాదులు చెబుతున్నారు. దీంతో మోదీ, ఉగ్రవాదులకు మధ్య ఘర్షణ తలెత్తుతోంది. ఒకవైపు మోదీ కశ్మీర్లో ఉగ్రవాదులు లేరు అంటుంటే మరోవైపు కశ్మీర్లో ఉగ్రవాదులు ఉంటున్నట్లు వారే స్వయంగా చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఘర్షణ కారణంగా పేద కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు.'
-అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత
ప్రధానికి లేఖ
వలస కూలీల మృతిపై అధీర్ రంజన్ చౌధురీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.