వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్‌కాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వరాజ్ మేగజిన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ కాంత్.. భారత్‌లో అతి ప్రజాస్వామ్యం ఉన్నందున క్లిష్టమైన సంస్కరణలను అమలు చేయడం కష్టతరం అని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడాలంటే మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కఠినమైన సంస్కరణలు తీసుకురాకుంటే చైనాతో పోటీ పడడం సులభం కాదని పేర్కొన్నారు.
వ్యవసాయం, గనులు, కార్మిక రంగాల్లో భారత్ అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపిన ఆయన.. రాష్ట్రాలు తర్వాతి దశ సంస్కరణలకు తప్పక ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. సంస్కరణలు తీసుకురావాలంటే రాజకీయ సంకల్పం ఉండాలన్న అమితాబ్.. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రదర్శించిందని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత కూడా కనీస మద్దతు ధర, మండీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రైతులతో చర్చలకు షా ఆహ్వానం.. 7 గంటలకు భేటీ