ప్రపంచంలోని అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన 'ధారావి' కొవిడ్ కట్టడిలో తీసుకున్న చర్యలను ప్రపంచబ్యాంక్ శ్లాఘించింది. వైరస్ నియంత్రణకు అక్కడి ప్రజలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు అనుసరణీయమని కీర్తించింది. తన ద్వైవార్షిక నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. మే నుంచి జులై వరకు నమోదైన కేసుల సంఖ్యను పోల్చితే గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది.
ముంబయిలోని ధారావిలో తొలి కరోనా కేసు ఏప్రిల్లో నమోదైంది. కేవలం 2.5 చ.కి.మీ కలిగిన ఈ ప్రాంతంలో ఆరు లక్షల యాభై వేల మంది నివాసం ఉంటారు. భౌతిక దూరం పాటించడం అసాధ్యమైన ఈ ప్రాంతం కరోనా కేసులకు కేంద్రబిందువుగా ఉండేది.
ఈ తరుణంలో స్థానిక అధికారులు పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ చర్యలను గుర్తించిన ప్రపంచ బ్యాంక్... అధికారులు, ఎన్జీఓలు చేసిన కృషిపై హర్షం వ్యక్తం చేసింది.
ధారావిలో వైరస్ నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే ప్రశంసించింది.
అధికారిక గణాంకాల ప్రకారం మంగళవారం నాటికి ధారావిలో మొత్తం కేసుల సంఖ్య 3,280. అందులో కోలుకున్నవారి సంఖ్య 2,795.
ఇదీ చూడండి: దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు