మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మరాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది అగ్రనేతల ప్రచారాలు జోరందుకుంటున్నాయి. వాటికి తగ్గట్టుగానే అగ్రనేతల ర్యాలీల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా అధికార భాజపా.. దాని మిత్రపక్షమైన శివసేనపై సోలాపూర్ జిల్లాలోని బర్షాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తీవ్ర విమర్శలు చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్.
పేదలకు 10 రూపాయలకే పూర్తి భోజనం అందిస్తామని శివసేన తన మానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవార్. ఇదే శివసేన గతంలో 'జున్కా- భాకర్' కేంద్రాలను ప్రారంభించిందని.. ఇప్పుడు అవి ఎక్కడా కనపడటం లేవని ఎద్దేవా చేశారు.
"1990లో తొలిసారి శివసేన-భాజపా కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. సబ్సిడీ ధరలతో జున్కా-భాకర్‌ను అమ్మడానికి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి ఎప్పుడు కనుమరుగయ్యయో.. శివసేన కార్యకర్తలు ఈ స్థలాలను ఎప్పుడు ఆక్రమించారో ఎవరికి గుర్తులేదు. ఇక ఇప్పుడు 10 రూపాయలకు భోజన పథకం అంటున్నారు. ప్రజలు మిమ్మల్ని రాష్ట్రాన్ని నడిపించమంటున్నారా? లేక భోజనాన్ని తయారు చేయమంటున్నారా?"
--- శరద్‌పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు.
'ఎన్ని ప్రశ్నలున్నా.. ఆర్టికల్ 370 రద్దు ఒక్కటే సమాధానం'
ఎన్నికల్లో ప్రతిపక్షం అసలు పోటీ ఇవ్వలేకపోతోందన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విమర్శలపై మండిపడ్డారు పవార్. ప్రతిపక్షం పోటీ ఇవ్వలేకపోతుంటే.. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 9 ర్యాలీలు, అమిత్ షా 20 బహిరంగ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
నిరుద్యోగం, మహిళల భద్రత, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై అమిత్ షాను ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు.. ఆర్టికల్ 370 రద్దు ఒక్కటే సమాధానంగా చెబుతున్నారని ఆరోపించారు ఎన్సీపీ అధ్యక్షుడు. షా ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టికల్ 370 రద్దు గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
'రైతుల ఆత్మహత్య పాపం పవారదే..'
మహారాష్ట్రలో రైతుల అత్మహత్యకు ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ప్రవేశపెట్టిన విధానాలే కారణమని ఆరోపించారు ఫడణవీస్. అకోలా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. అన్నదాతల ఆత్మహత్య పాపం పవార్‌దేనని వ్యాఖ్యానించారు.
శరద్‌పవార్‌పై భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. కళ్ల ముందు ఓటమి కనపడుతుండటం వల్లే పవార్ నిగ్రహం కోల్పోయి భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష నేతలు జైళ్లు-ఈడీ కార్యాలయాల మధ్యే పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి:- 'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం