దేశ సరిహద్దుల్లో పహరా కాసే విధుల్లో మహిళా సైనికులకూ తొలిసారిగా అవకాశం దక్కింది. జమ్ముకశ్మీర్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో భద్రతా విధుల్లో వీరు పాల్గొంటున్నారు. భారత సైన్యంలోని పలు విభాగాల్లో తమ సత్తాను చాటుతున్న మహిళలకు సరిహద్దుల్లో సైనిక విధులను కేటాయించడం ఇదే ప్రథమం.
పారామిలటరీ ఫోర్స్‌లో విధులు నిర్వర్తించే అసోం రైఫిల్స్‌కు చెందిన మహిళా సాయుధ దళాల బృందానికి ఈ అవకాశం దక్కింది. ఆ దళానికి చెందిన 30 మందిని ఎంపిక చేసి కఠిన శిక్షణను అందించారు. భారత సైనిక విభాగం, ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ (ఏఎస్‌సీ)కు చెందిన మహిళా కెప్టెన్ గుర్ సిమ్రన్ కౌర్ నేతృత్వంలో ఈ మహిళాసైనిక దళం విధులు నిర్వర్తిస్తోంది.
కశ్మీర్ లోయలో..
కౌర్... తన కుటుంబం నుంచి మూడో తరం సైనికురాలు. పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద నియామకమైన వీరి బాధ్యతలు అత్యంత క్లిష్టమైనవి. సమీప ప్రాంతంలోని తంగ్‌దార్, తిత్వాల్‌కు మధ్య ఉన్న 40కి పైగా గ్రామాల ప్రజలు సాధనా పాస్‌ను దాటి కశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అటువంటి సందర్భాల్లో వాహనాల్లో ప్రయాణించే స్థానిక మహిళలను నిశితంగా పరిశీలించి పంపించడం సైనికులకు కష్టతరమవుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా మహిళా సైనికుల్ని వినియోగిస్తున్నారు. శత్రుదేశం నుంచి మత్తుపదార్థాలు, దొంగనోట్లు, ఆయుధాల అక్రమరవాణాను నిరోధించే కఠినతరమైన విధులనూ వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. భద్రత పరంగా ఎంతో కీలకమైన ప్రదేశంలో సేవలందించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మహిళాసైనిక దళం అత్యంత చురుగ్గా పనిచేస్తోంది.
ఇదీ చూడండి: వధువు ఫొటోషూట్‌లో 'లెబనాన్ పేలుడు' దృశ్యాలు