అత్త-కోడళ్ల మధ్య ఎప్పుడూ వైరమే ఉంటుంది అని చాలా సందర్భాల్లో వింటుంటాం. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబంలో ఇలాంటి మాటలకు చోటులేదు. 39 మంది కలిసి జీవిస్తున్న ఈ ఉమ్మడి కుటుంబంలో ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ. ఇంట్లో ఉన్న 11 మంది కోడళ్లకు అత్తంటే విపరీతమైన అభిమానం. అందుకే ఆమె జ్ఞాపకార్థంగా ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేశారు. ఆమె కోసం ప్రతి నెలా పూజలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.
అత్తే దైవమై....
రతన్‌పూర్‌కు చెందిన శివప్రసాద్ తంబోలి విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన భార్య గీతా దేవి. ఈ దంపతులకు ముగ్గురు తనయులు ఉన్నారు. అయితే శివప్రసాద్ సోదరులు, వారి జీవితభాగస్వాములు, ఇతరులు కలిపి... మొత్తంగా 39 మంది ఉన్న ఉమ్మడి కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తుండేవారు ఈ దంపతులు.
కుటుంబం ఉమ్మడిగా ఉండడంలో గీతా ముఖ్య పాత్ర పోషించారు. సొంత కోడళ్లు, ఇతరులు అని తేడా లేకుండా గీతా అందరినీ ఒకేలా చూసుకునేవారు. ప్రేమ, బంధం విలువలు నేర్పించేవారు. ఈ నేపథ్యంలో తన 11 మంది కోడళ్లకు గీతపై అపారమైన ప్రేమ పెరిగింది.
2010లో ఆనారోగ్యంతో గీత మరణించారు. ఈ విషయాన్ని గీతా దేవి 11 మంది కోడళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఆమెను ఆరాధ్య దైవంలా కొలిచే వారు... అత్తకోసం గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లో ఇంట్లోనే గుడి కట్టి, గీతా విగ్రహానికి బంగారు నగలు అలంకరించారు. అత్తపై ఉన్న ప్రేమతో ప్రతి నెలా భజనలు చేస్తున్నారు. ప్రతి రోజు తమ అత్త విగ్రహానికి దండం పెట్టుకుంటామని చెబుతున్నారు.
ఇదీ చదవండి:వాయుసేన గణతంత్ర విన్యాసాలకు మహిళ సారథ్యం