ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా గోందెరాస్ గ్రామం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ గుర్తుందా? గురువారం జరిగిన ఆ ఘటనలో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఆ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు మహిళా కమాండోలూ పాల్గొన్నారు. వీళ్లే "దంతేశ్వరీ లడాకే" ప్లాటూన్ సభ్యులు. మొత్తం 30 మంది ఈ బృందంలో ఉన్నారు. బస్తర్ ప్రాంతంలో నక్సలిజం అంతం చేయటమే ఈ దళం లక్ష్యం.
ప్రతికూలతలను అధిగమించేలా శిక్షణ
ఈ 30 మంది దంతేశ్వరీ లడాకే సభ్యులకు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో పాల్గొనేందుకు, ప్రతికూలతలను అధిగమించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. శారీరక పటుత్వం కోసం ఉదయమే పరుగు, డ్రిల్ నేర్పిస్తున్నారు. షూటింగ్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఐఈడీల ముప్పు లేకుండా, అటవీ ప్రాంతంలో సంచరించేందుకు బైక్ రైడింగ్ నేర్పిస్తున్నారు.
మూడు నెలల క్రితం వీరికి శిక్షణ మొదలైంది. మరో మూడు నెలల్లో పూర్తవుతుంది. నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లలో పురుషులతో కలిసి వీళ్లు పాల్గొంటారు.
"బస్తర్ బెటాలియన్‌లో మహిళా కమాండోలను నియమించాలనే ఆలోచన ముందు నుంచే ఉంది. కానీ జిల్లా పోలీసు విభాగంలో ఈ తరహా మహిళల బృందం ఇంతకు ముందులేదు. ఇప్పుడు ఎస్పీ చొరవతో దంతేశ్వరీ లడాకే మహిళా దళం తయారైంది. దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ)లో ఇది ఆరో బృందంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం పురుషులతో కూడిన దళాలు 5 ఉన్నాయి. దంతేశ్వరీ లడాకే ఆరో దళం కానుంది."
-శిక్షణ ఇస్తున్న అధికారిణి
నక్సల్స్ బాధితులే సభ్యులు
దంతేశ్వరీ లడాకే దళానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో సభ్యులు కొందరు లొంగిపోయిన మహిళా నక్సలైట్లు. మరికొందరు నక్సల్స్ చేతిలో భర్తను కోల్పోయినవారు.
"బైరాంగడ్ ప్రాంతంలో నేను నక్సలైటుగా పనిచేశాను. ఆయుధాలు అమ్మటం లాంటి పని ఉండేది. 2014లో లొంగిపోయాను. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేర్చారు. నేను సెలవులకు ఇంటికి వచ్చాను. అప్పుడు పోలీసులు పట్టుకున్నారు. నా బంధువు పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. మళ్లీ తిరిగి అడవులకు వెళ్లొద్దని సలహా ఇచ్చారు. ఇక్కడే మంచి ఉద్యోగం, జీవితం లభిస్తాయని చెప్పారు. మనసు మార్చుకుని లొంగిపోయాను. ఇప్పుడు ఇక్కడ చేరాను."
-సునీత, దంతేశ్వరీ లడాకే దళ సభ్యురాలు
"నా భర్తను నక్సలైట్లు కాల్చి చంపారు. నేను అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నా భర్తను నాకు శాశ్వతంగా దూరం చేసిన వారికీ అదే గతి పట్టించాలి."
-దంతేశ్వరీ లడాకే దళ సభ్యురాలు
అధికారుల ప్రశంసలు
ఛత్తీస్‌గఢ్ పోలీసులు మహిళా కమాండోలను బిజాపూర్, కాన్ఖేర్, నారాయణ్‌పూర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నియమించారు. వీళ్లు ఎంతో బాగా పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించే ఆపరేషన్లకు వీళ్లను పంపిస్తున్నారు.