భారత అంతరిక్ష చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు ‘గగన్‌యాన్’. దీని ద్వారా 2022 నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యోమగాముల్లో మహిళలు సైతం ఉండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అలాంటి అవకాశమేదీ లేదని తాజాగా ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సాయుధ బలగాల్లో ఫ్లయింగ్ అనుభవం ఉన్న టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం ఆ స్థాయిలో మహిళలెవరూ లేకపోవడం వల్ల గగన్‌యాన్‌లో వారికి అవకాశం ఉండకపోవచ్చని సదరు అధికారి తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మానవ సహిత రోదసి యాత్రలో మహిళలతో పాటు సామాన్య పౌరులకు కూడా అవకాశం వస్తుందని అన్నారు.
ప్రధాని ప్రకటనతో..
2018 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ గగన్‌యాన్ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. 2022నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇస్రో ఇప్పటికే వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఎంపిక చేసిన ముగ్గురికి తొలుత భారత్‌లో ఆ తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పించనున్నారు.
గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ ఘనత దక్కించుకోనుంది.
ఇదీ చూడండి: మరో 11 రోజుల్లో జాబిల్లిపైకి చంద్రయాన్-2