ఓ పక్క కరోనా కలవరం. మరో పక్క జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాలు అందుబాటులో లేకపోవడం వైద్యులను, ప్రభుత్వాలను కంగారుపెడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేసి విజయం సాధించారు మినాల్ దాఖవే భోస్లే. పుణెకు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సంస్థ కేంద్రంగా కరోనా వైరస్ టెస్టింగ్ కిట్‌ను రూపొందించారామె. తాజాగా వాటిని అమ్మేందుకు ప్రభుత్వ లైసెన్సు పొంది, ఈ అర్హత సాధించిన మొదటి భారత సంస్థగా గుర్తింపు సాధించిందా సంస్థ.
సమస్యలను అధిగమించి....
మినాల్ భోస్లే వైరాలజిస్టు. మైల్యాబ్స్ సంస్థలో చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్‌గా, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ కేసులు భారత్‌లో వెలుగుచూసే సమయానికి ఆమె నిండు గర్భిణి. గర్భసంబంధ సమస్యల కారణంగా ఫిబ్రవరిలో కొన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఏ క్షణంలోనైనా ప్రసవం కావొచ్చని, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పంపారు వైద్యులు. ఆమె మాత్రం అవేవీ పట్టించుకోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన కొన్ని రోజులకే నిర్ధారణ కిట్‌ల తయారీకి ఎంపిక చేసిన జట్టుకు నాయకత్వం వహించారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడుతున్నా వెనకడుగు వేయలేదు. ఫిబ్రవరిలో పదిమంది బృంద సభ్యులతో శ్రీకారం చుట్టి... కేవలం ఆరు వారాల్లోనే కిట్‌ను రూపొందించారు. దీనికి ‘పాథో డిటెక్ట్’ అని పేరు పెట్టారు. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వైరస్ నిర్ధరణ పరికరాలను మన దేశంలో వాడుతున్నారు. వాటి ధర సుమారు 4500 రూపాయలు. పైగా వైరస్‌ను నిర్ధారించడానికి ఇవి ఆరు నుంచి ఏడు గంటల సమయం తీసుకుంటాయి. మినాల్ తయారుచేసిన పరికరం ధర కేవలం 1200 రూపాయలే. ఇవి రెండున్నర గంటల్లోనే నిర్ధారణ పరీక్షల ఫలితాలను ఇవ్వడం విశేషం. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్... పాథో డిటెక్ట్‌కు ఈ సోమవారం కమర్షియల్ అప్రూవల్ ఇచ్చింది. కరోనా వైరస్ టెస్టింగ్‌లో ఈ కిట్ వందశాతం సత్ఫలితాలనిచ్చినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ తెలిపింది. ఇప్పటికే 150 కిట్లను అవసరమైన వైద్యశాలలకు పంపించారు. ప్రభుత్వం ఆదేశిస్తే రోజుకు వేలల్లోనూ వీటిని తయారుచేసి ఇచ్చేందుకుసిద్ధమంటోందా సంస్థ.
ఆ తర్వాతే ఆసుపత్రికి...
పాథో డిటెక్ట్‌కు తుది రూపు తీసుకొచ్చి, ఈ నెల 18న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అప్రూవల్‌కోసం పంపించారు మినాల్. ఆ తరువాతే ప్రసవం కోసం హాస్పిటల్‌లో చేరారు. ఆ మరుసటి రోజు పండంటి పాపాయికి జన్మనిచ్చారు. ‘ఇప్పుడు మనమందరం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే దీన్ని నేను సవాల్‌గా స్వీకరించా. దేశాన్ని కరోనా మహమ్మారి బారినుంచి కాపాడటానికి నావంతు ప్రయత్నం చేశాననే సంతృప్తితో కాన్పు కోసం వెళ్లాను’ అని చెబుతున్నారామె. తక్కువ ఖర్చుతో, ఎక్కువ కచ్చితత్వంతో ఫలితాలు ఇచ్చే పాథో డిటెక్ట్‌ను కనిపెట్టినందుకు ఎంతోమంది ప్రశంసలందుకున్నారామె. ‘నువ్వు పాపతో పాటు దేశానికి ఉపయోగపడే టెస్టింగ్ కిట్‌ను కూడా డెలివరీ చేశావు...’ అని ఆనంద్ మహీంద్రా అంటే, ‘నాలాంటి ఎంతోమంది అతివలకు నువ్వు స్ఫూర్తిగా నిలిచావు’ అని కిరణ్ మజుందార్‌షా వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు మినాల్ కృషిని కొనియాడారు.