ఉత్తర్ప్రదేశ్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తన భర్త మొదటి భార్య సంతానాలను ప్రేమతో చూసుకోవాల్సింది పోయి.. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది ఓ మహిళ. పిల్లలనే జాలి కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసిన ఆమె.. ఇప్పుడు జైలు పాలైంది.
ఏం జరిగిందంటే...
అలీఘఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళకు జితేంద్ర కుమార్ శర్మ అనే వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల కిందట తన భార్యను కోల్పోయిన అతడికి నలుగురు పిల్లలు(ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు) ఉన్నారు. తాను నర్సునని నమ్మించి జితేంద్రను పెళ్లి చేసుకుంది ఆ మహిళ. అలా అతడి కుటుంబంలోకి ప్రవేశించిన ఆమె.. పిల్లలను మత్తు పదార్థాలకు బానిస చేసింది. అనంతరం వారు అపస్మార స్థితిలోకి జారుకున్నాక.. పెద్దమ్మాయిని పలుమార్లు వేధింపులకు గురిచేసేది.
బాధితురాలు(పెద్ద కూతురు) పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. ఆమెకు గతంలోనే ముగ్గురితో వివాహమైందని తేలింది. మైనర్పై లైంగిక దాడులకు పాల్పడిన ఆ మహిళపై ఐపీసీ సెక్షన్-354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: మురికి కాలువలో 25 ఆవుల మృతదేహాలు- ఏమైంది?