ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కుల రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని స్పష్టంచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఆయనకు జాతీయవాదమే ఆదర్శమన్నారు.
మోదీ కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు పి. చిదంబరం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ట్వీట్లకు బదులిచ్చారు జైట్లీ.
" ప్రధాని కులంతో సంబంధమేంటి? ఆయన ఏనాడు కుల రాజకీయాలు చేయలేదు. జాతీయవాదమే ఆయనకు ఆదర్శం. కులాలపై రాజకీయం చేసే వారు విజయం సాధించలేరు. వీటి పై రాజకీయం చేసి కోట్లు సంపాదించుకున్నాయి బీఎస్పీ, ఆర్జేడీ వ్యవస్థాపకుల కుటుంబాలు. వారికున్న ఆస్తుల్లో ప్రధానికి 0.01శాతం కూడా లేవు."
-ట్విట్టర్లో జైట్లీ
"నేను అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వాడిని. నన్ను కుల రాజకీయాల్లోకి లాగొద్దని మాయావతిని అభ్యర్థిస్తున్నా. 130 కోట్ల మంది నా కుటుంబం" అని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఉన్నత కులంలో పుట్టిన మోదీ ఓబీసీ అని చెప్పుకుంటారని, ఓట్ల కోసం ఆయన ఏమైనా చేస్తారని ట్వీట్ చేశారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ట్వీట్ చేశారు. మోదీ ఓబీసీకి చెందినవారని గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఇప్పుడేమో కులం లేదంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు చాయ్‌వాలా అని చెప్పుకున్న ఆయన ఇప్పడేమో ఆ ఊసే ఎత్తట్లేదని ఆరోపించారు. ప్రజల్ని అవివేకులనుకుంటున్నారా? అని విమర్శించారు చిదంబరం.
ఇదీ చూడండి: ఆర్టికల్ 370, 35ఏలను రద్దుచేయాలి:రాజ్‌నాథ్