బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా- జేడీయూ మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే ఈ రెండు పార్టీలు చెరి సగం సీట్లు పంచుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య బిహార్ ఎన్డీఏ కూటమి నుంచి ఎల్జేపీ(లోక్‌జనశక్తి పార్టీ) వైదొలిగిన నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎల్జేపీ ఆలస్యంగా తన నిర్ణయాన్ని వెల్లడించడం వల్ల జేడీయూతో సీట్ల పంపిణీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదని భాజపా వర్గాలు తెలిపాయి.
ఇక ఇప్పుడు కూటమి నుంచి ఎల్జేపీ తప్పుకోవడం వల్ల.. జేడీయూ(మాంజీ హిందుస్థానీ ఆవామ్ మోర్చాతో కలిపి) 122 సీట్లల్లో.. భాజపా 121 చోట్ల పోటీ చేసే అవకాశమున్నట్టు సమాచారం. అయితే వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ.. భాజపాతో పొత్తు కుదుర్చుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఒంటరిగానే ఎల్జేపీ...
బిహార్‌లోని ఎన్డీఏ కూటమి నుంచి.. ఎల్జేపీ వైదొలిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ నేతృత్వంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని.. ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎల్జేపీ నిర్ణయించింది. జేడీయూతో సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా.. కూటమి తరఫున కాకుండా విడిగా పోటీచేయనున్నట్లు సమావేశం అనంతరం ప్రకటన విడుదల చేసింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది.
మరోవైపు.. భాజపాతో కూటమి ఏర్పాటు చేసే అంశానికి మద్దతిస్తూ.. ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీర్మానించారు. భాజపాతో బలమైన సంబంధాలనే కోరుకుంటున్నట్లు.. ఎల్జేపీ తెలిపింది. భాజపా నేతృత్వంలో బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఆ దిశగా తమ పార్టీ ఎమ్మెల్యేలు సైతం సహకరిస్తారని వెల్లడించింది.
ఇదీ చూడండి:- వృద్ధులకు మరింత సులువుగా 'పోస్టల్ బ్యాలెట్'