శీతాకాలంలో శ్వేతవర్ణం కాంతుల్లో భూతల స్వర్గాన్ని తలపిస్తోంది జమ్ముకశ్మీర్. మంచు పర్వతాల అందాలు కనువిందు చేసే గుల్మార్గ్ ప్రాంతం.. స్వదేశీ, విదేశీ పర్యటకుల రాకతో సందడిగా మారింది.
"ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. చాలా సురక్షితంగా అనిపిస్తుంది. ఉగ్రవాదం పుట్టినిల్లుగా కశ్మీర్‌ను అభివర్ణిస్తారు. కానీ, ఈ ప్రాంతం అలా లేదు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కశ్మీర్‌ను చూడాలి."
-పర్యటకురాలు.
తెల్లటి మంచుదుప్పటి కప్పినట్లుగా ఉండే గుల్మార్గ్ ప్రాంతాన్ని ఈ సమయంలో సందర్శించడంపై పర్యటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా... గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత మంది ప్రజలు కశ్మీర్‌ను సందర్శించడం విశేషం.
చలి పులి పుంజా...
కశ్మీర్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం శ్రీనగర్‌లో కనిష్ఠంగా మైనస్ 8.4 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. ఫలితంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
గత ముప్పై ఏళ్లలో ఉష్ణోగ్రతలు ఇంతలా పడిపోలేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లో అత్యల్పంగా....1995లో మైనస్ 8.3 డిగ్రీలు, 1991లో మైనస్ 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.
డిసెంబర్ 21 నుంచి జవవరి 31 మధ్య కాలంలో కశ్మీర్ వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ 40 రోజుల పాటు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని 'చిల్లై-కలాన్' అంటారు.
బోటు యజమానులకు కష్టకాలమే....
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో దాల్ సరస్సు గడ్డ కట్టింది. ఈ దృశ్యం చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నా... బోటు యజమానులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆర్టికల్ 370 రద్దు, కరోనా కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన తమకు... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరింత నష్టం చేకూర్చుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"విపత్కర పరిస్థితులు మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్యాకేజీలు విడుదల చేసింది. కానీ, మావరకు డబ్బు చేరడం లేదు. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఆ డబ్బు ఏం సరిపోతుంది. దీనిపై పునరాలోచన చేసి మాకు మద్దతుగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా."
- బోటు యజమాని.
ఇదీ చదవండి: