దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో రోజురోజుకూ వందల కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ చేస్తున్న పోరులో సాయం చేసేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో ముందుకు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. పుణేలో ఓ విప్రో కార్యాలయాన్ని 450 పడకల ఆసుపత్రిగా మార్చుతున్నట్లు తెలిపారు.
" హింజెవాడీ ప్రాంతంలో విప్రోకు చెందిన ఓ కార్యలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చుతుంది. ప్రస్తుత ఐటీ కార్యాలయాన్ని ఆసుపత్రిగా మార్చి ప్రభుత్వానికి అందజేసేందుకు మరో నాలుగు వారాలు పడుతుంది. మే 30 నాటికి ఈ పని పూర్తవుతుంది. ఏడాది తర్వాత ఈ ఆసుపత్రి తిరిగి ఐటీ కార్యాలయంగా మారుతుంది."
- అధికారిక ప్రకటన.
కరోనా బాధితులకు చికిత్స అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలోనే ఉండేందుకు 24 గదులు కూడా ఉంటాయి. అలాగే హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలతో పాటు సిబ్బందిని కూడా విప్రోనే ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన..
తమ కార్యాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చాలన్న విప్రో నిర్ణయాన్ని స్వాగతించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. మానవతా దృక్పథంతో విప్రో చేసిన ఈ సాయం వల్ల రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయని ప్రకటించారు.