ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ముఖాముఖి ఇచ్చారు ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే 'బాత్ బిహార్ కీ' కార్యక్రమం ద్వారా కోటిమందిని సంఘటితం చేయనున్నట్లు వెల్లడించారు. మూడు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ నుంచి బహిష్కృతులైన నాటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రారంభించారు పీకే. రానున్న పదేళ్లలో చేపట్టే పనులపై ముఖ్యమంత్రి వద్ద ప్రణాళికలు ఉండాలని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
భాజపాతో పొత్తు కోసం సైద్ధాంతికంగా రాజీపడి ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ అగౌరవపరిచారని ఆరోపించారు పీకే. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. బిహార్ 2005లో పేద రాష్ట్రంగా ఉండేదని, ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొన్నారు. బిహార్‌లో అభివృద్ధి జరుగుతున్నా, అంత వేగంగా మాత్రం లేదని విశ్లేషించారు. తాను ఎల్లప్పుడూ గాంధీ సిద్ధాంతాలను విడిచిపెట్టనని చెప్పే నితీశ్... అదే సమయంలో గాడ్సే సిద్ధాంతాలకు మద్దతు తెలిపే వ్యక్తులతో ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు. గాంధీ, గాడ్సే సిద్ధాంతాలు కలిసి ఉండలేవని వ్యాఖ్యానించారు. భాజపాతో కలిసి ఉండటం నితీశ్ ఇష్టం అని స్పష్టం చేశారు. బిహార్‌ను దేశంలోని పది ఉత్తమమైన రాష్ట్రాల్లో ఒకటిగా తయారు చేసేందుకు ఈ నెల 20న 'బాత్ బిహార్ కీ' పేరుతో కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ప్రశాంత్.
"గాంధీజీ సిద్ధాంతాలను నితీశ్‌కుమార్ గతంలో పాటిస్తూ ఉండేవారని నాకు తెలుసు. గాడ్సే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అనేక అంశాలపై నితీశ్ ఇప్పుడు గాడ్సే జిందాబాద్ అనే వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ తేడా లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ స్థితి లేదు."
-ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు ఇలా...