రాజస్థాన్లో నెలన్నర రోజులుగా కొనసాగిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. తిరిగి పార్టీ గూటికి చేరిపోయారు. ఆగస్టు 14 నుంచి కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచిన్ పైలట్తో ప్రత్యేకంగా మాట్లాడింది ఈటీవీ భారత్.
పదవులు ముఖ్యం కాదు
ఆరేళ్ల పదవీ కాలంతో రాజస్థాన్లో సుదీర్ఘ కాలం పనిచేసిన పీసీసీ చీఫ్గా సచిన్ రికార్డు సృష్టించారు. అయితే ఈ పదవుల కోసం తానెప్పుడూ పరితపించలేదని ఆయన స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా తనకు మద్దతిచ్చిన ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.
"రాజస్థాన్ ప్రజలతో నాకు అవినాభావ బంధం ఉంది. పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా, చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాను."
-సచిన్ పైలట్
అధిష్ఠానం ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు సచిన్. తాము లేవనెత్తిన సమస్యలను కమిటీ పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి- బెంగళూరులో ఒక్కసారిగా ఎందుకింత హింస?