కశ్మీర్లో పరిస్థితులు పరిశీలించేందుకు రాహుల్ గాంధీకి ప్రత్యేక విమానం పంపిస్తామని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కశ్మీర్ లోయలో హింసాత్మక వాతావరణం నెలకొందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక్కడి పరిస్థితులను చూశాక మాట్లాడాలని సూచించారు. పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కాంగ్రెస్ నాయకుడి ప్రవర్తనను.. రాహుల్‌గాంధీ అవమానకరంగా భావించాలన్నారు గవర్నర్.
"కశ్మీర్‌కు రావాలని రాహుల్‌గాంధీని ఆహ్వానించా. ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు మీకు విమానం పంపుతాం. అప్పుడు మాట్లాడండి. మీరు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, అలా మాట్లాడకూడదు. అధికరణ 370 రద్దులో ఎలాంటి మతపరమైన కోణం లేదు. ఇది అందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం. కశ్మీర్‌పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందులో సఫలం కాలేకపోతున్నారు."
- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ గవర్నర్
జమ్ముకశ్మీర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయని గత శనివారం రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించారు రాష్ట్ర గవర్నర్ మాలిక్.
విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించినట్లు తెలిపారు మాలిక్. కశ్మీర్లో ఏ ఒక్కరికీ బుల్లెట్ గాయం కూడా కాలేదన్నారు. చిన్న చిన్న ఘర్షణల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి తప్పా ఎక్కడా హింసాత్మక వాతావరణం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర