కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకూ తాము దిల్లీ సరిహద్దుల్లోనే ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు మరోసారి తెగేసి చెప్పాయి. ఇప్పటి వరకు తాము ప్రశాంతంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించామని.. ఇకపైనా శాంతియుతంగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశాయి. జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ వైపుగా ట్రాక్టర్ ర్యాలీకి పిలునిచ్చామని రైతు సంఘాల నేతలు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
జనవరి 26న ట్రాక్టర్లపై జాతీయ జెండాలతో 'కిసాన్ పరేడ్' పేరిట ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకుడు దర్శన్ పాల్ తెలిపారు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన వెంటనే తమ ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే 23న ప్రతి రాష్ట్రంలో గవర్నర్ల నివాసాల వైపు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలో 50 మంది రైతులు అమరులయ్యారని మరో నేత అశోక్ ధవాలే ఆవేదన వ్యక్తం చేశారు.
'డిమాండ్లు అంగీకరించలేదు'
ప్రభుత్వం ఇప్పటి వరకు 50 శాతం డిమాండ్లను అంగీకరించిందని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి ఒక్క హామీ కూడా లభించలేదన్నారు.
ఇదీ చదవండి: వీడని ప్రతిష్టంభన - 2 అంశాలపై ఏకాభిప్రాయం
కనీస మద్దతు ధరపై దేశ ప్రజలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని రైతు నేత గుర్నామ్ సింగ్ చౌదునీ అన్నారు. '23 రకాల పంటలను కనీస మద్దతు దరకు కొనుగోలు చేస్తారా? అని గత సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దానికి 'లేదు' అని సమాధానం ఇచ్చారు' అని తెలిపారు.
మరోవైపు చట్టాల రద్దు కోసం చేస్తున్న ఆందోళన 38వ రోజుకి చేరింది. ఈ నెల 4వ తేదీన జరగనున్న ఏడో విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చకపోతే.. హరియాణాలోని మాల్స్, పెట్రోల్ బంకులను మూసివేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆరు దఫాలుగా జరిగిన చర్చల్లో రైతుల ప్రధాన డిమాండ్లు అయిన మూడు సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ అంశాల్లో ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదని రైతు సంఘాల నేతలు శుక్రవారం విమర్శించారు. ప్రభుత్వంతో చర్చలు ఇలానే ఫలితాన్నివ్వకుండా సాగుతూ ఉంటే ఆందోళనల తీవ్రతను పెంచుతామని హెచ్చరించారు. జనవరి 6న కుంద్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్త నిరసనలకూ పిలుపునిస్తామని తెలిపారు.