భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై తన సైద్ధాంతిక పోరు ఆగదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. గత ఐదేళ్లతో పోలిస్తే 10 రెట్లు రెట్టించిన శక్తితో వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. తానెప్పుడూ పేదలు, రైతులు, కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్, భాజపా సిద్ధాంతాలే గౌరీ లంకేశ్ ప్రాణాలు తీశాయని రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై వేసిన పరువునష్టం కేసు విచారణ నిమిత్తం ముంబయి కోర్టులో హాజరయ్యారు రాహుల్. అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.
పార్టీ అధ్యక్ష పదవి రాజీనామాపై పాత్రికేయులు ప్రశ్నించగా... తాను చెప్పదల్చుకున్నదంతా నాలుగు పేజీల రాజీనామా లేఖలో సమగ్రంగా చెప్పానని... ఇక చెప్పడానికి ఏమీ లేదన్నారు రాహుల్ గాంధీ.
రాజీనామా వెనక్కి తీసుకోవాలని నినాదాలు
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలని ముంబయి కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు పార్టీ కార్యకర్తలు. రాజీనామాను వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.