రష్యా పర్యటన ముగించుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆకస్మికంగా ఇరాన్ వెళ్లారు. టెహరాన్‌లో ఇరాన్ రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అమీర్ హతమితో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతపై సాగిన చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు.
అయితే, ఇక్కడో ప్రశ్న తలెత్తుతోంది. ఇరాన్‌తో సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు భారత్ చేస్తోన్న ప్రయత్నాలు సమర్థమైనవేనా? ఇరాన్ విషయంలో భారత్ సరైన సమయంలో స్పందించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రక్షణ మంత్రుల సమావేశం ఆకస్మికంగా జరిగిందా? లేదా ముందు నుంచే అనుకున్నదా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ భేటీకి చాలా ప్రాముఖ్యం ఉంది.
భారత్, చైనా, ఇరాన్ సంబంధాలు..
చైనా- ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మరోవైపు.. భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి లక్ష మంది బలగాలను మోహరించాయి ఇరు దేశాలు. యుద్ధ సామగ్రి, విమానాలను సిద్ధంగా ఉంచాయి.
చైనా, ఇరాన్ సంబంధాలు బలోపేతం కావటానికి కారణం.. అమెరికా ఆంక్షలు విధించటం. వీటిని చైనా విస్మరించాలని నిర్ణయించింది. అంతేకాకుండా చైనా ఆర్థికంగా, భౌగోళికంగా అమెరికాకు దీటుగా ఉండటమూ ఇరాన్‌ను ఆకర్షించింది. అమెరికా ఆంక్షల కారణంగా అతిపెద్ద కొనుగోలుదారు అయిన భారత్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో.. చమురును అమ్ముకునేందుకు చైనా చక్కని అవకాశంగా భావించింది ఇరాన్.
భారత్, ఇరాన్ మధ్య సంప్రదాయంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్... షియా ముస్లిం ఆధిక్య దేశం. భౌగోళిక వ్యూహాత్మక సంబంధాలతో పాటు సున్నీ మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతు ఇవ్వటం వల్ల ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఇరాన్‌ను దూరం చేయాలని భారత్ భావిస్తోంది.
చాబహార్ పోర్టు
చాబహార్ నౌకాశ్రయం ప్రాజెక్టులో భారత భాగస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంతో రాజ్‌నాథ్ ప్రయత్నం చేసి ఉంటారు. అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా, రష్యాతో వాణిజ్యానికి చాబహార్ పోర్ట్‌తో అనుసంధానించే కారిడార్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది.
చాబహార్ పోర్ట్ నిర్మాణంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు వర్తించవు. చాబహార్‌లోని షాహిద్ బెహెస్ట్రీలో రెండు 600 మీటర్లు, 640 మీటర్ల కార్గో టెర్మినళ్ల ప్రణాళికకు భారత్ చాలా సమయం తీసుకుంది. ఈ సమయంలో చాబహార్-జహెదాన్ రైల్వే ప్రాజెక్ట్ చైనా చేతుల్లోకి వెళ్లింది.
కశ్మీర్ అంశం..
అమెరికా వ్యతిరేక ముస్లిం దేశాల కూటమిలో ఇరాన్ ఒక భాగం. ఇందులో టర్కీ, ఖతార్, మలేసియా కూడా ఉన్నాయి. ముస్లిం దేశాలు వ్యతిరేకించే ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా సంబంధాల కారణంగా ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఓఐసీ) వెలువల ఈ దేశాలు కొత్త కూటమిగా ఏర్పడ్డాయి.
కశ్మీర్ విషయంలో సౌదీ వ్యవహార శైలిపై పాకిస్థాన్ గుర్రుగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త కూటమిలో పాక్ సహజసిద్ధంగా సభ్యదేశంగా ఉంటుందనటంలో సందేహం లేదు.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. అక్కడి పౌర నిబంధనలు మారాయి. షియా వర్గం అధికంగా ఉండే కశ్మీర్లో ప్రజలు మార్గదర్శకత్వం కోసం సాధారణంగా ఇరాన్‌వైపే చూస్తారు. అయితే, కశ్మీర్ విషయంలో ఇప్పటివరకు స్పందించకపోవటం వల్ల ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణపై భారత్ ఆసక్తితో ఉంది.
(రచయిత- సంజీవ్ బారువా)