అర్ధాంతరంగా మృత్యువాత పడే అభాగ్య జనావళిని చూసి 'అంతా విధిలిఖితం' అని నిట్టూరుస్తాంగాని, ఆయా దుర్ఘటనలకు మూలకారణాల్ని అన్వేషిస్తే నేరపూరిత విధివైఫల్యాలెన్నో కనిపిస్తాయి. దేశ రాజధాని దిల్లీ ఉత్తర ప్రాంతంలోని అనాజ్‌మండి ప్రాంతంలో అక్రమంగా నడుపుతున్న బ్యాగుల తయారీ కేంద్రంలో నిన్న తెల్లవారుజామున ఎగసిపడిన అగ్నికీలలు 43 నిండు ప్రాణాల్ని కర్కశంగా కబళించాయి. 1997 జూన్‌లో దిల్లీలోని ఉపహార్ సినిమా హాల్‌లో చెలరేగిన మంటలు 59మంది ఉసురుతీసిన దారుణం దరిమిలా రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా ఇది నిలుస్తోంది. ప్రాథమిక విచారణలో కరెంట్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు గుర్తించామన్న అధికార గణం- 600 చదరపు గజాల్లో నిర్మితమైన ఆ నాలుగంతస్తుల భవనానికి అగ్నిమాపక శాఖ అనుమతిగాని, ప్రమాదాన్ని కాచుకొనేలా భద్రతా ఏర్పాట్లుగాని ఏమీలేవని తీరిగ్గా ప్రకటిస్తోంది. 150మంది సిబ్బందితో మూడు పదుల అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి గంటల తరబడి కృషిచేసి 63మంది ప్రాణాలు కాపాడగలిగినా, దట్టంగా అలముకొన్న పొగభూతమే ఎంతోమంది అభాగ్యుల్ని బలిగొంది. మొన్న ఫిబ్రవరిలోనూ దిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో అచ్చం ఇలాగే సంభవించిన అగ్ని ప్రమాదంలో హోటల్‌లో బస చేసిన 17మంది అతిథులు నిస్సహాయంగా ప్రాణాలు వదిలారు. వెంటనే 'అప్రమత్తమైన' ప్రభుత్వ యంత్రాంగం- పలుచోట్ల భద్రతా తనిఖీలు చేపట్టి 57 హోటళ్లకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాల్ని రద్దు చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలున్నా లేకున్నా క్షేత్రస్థాయిలో భద్రత దేవతావస్త్రమేనన్న వాస్తవం పదేపదే రుజువవుతోంది. లక్షకు పైగా జనసంఖ్య గల 144 పట్టణాల్లో అగ్నిప్రమాద నివారణ మౌలిక వసతులు అధ్వానంగా ఉండటం, అధికాదాయంపై యావేగాని కనీస భద్రతపై ధ్యాసలేని వ్యక్తులు నిర్మించే భవనాలు తామరతంపరగా పుట్టుకొస్తుండటంతో- పౌరులకు గల జీవనహక్కే గాలిలో దీపం అవుతోంది!
పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులు..
అగ్ని ప్రమాద నివారణ సన్నద్ధత కొరవడటాన్ని ‘ఏ క్షణాన అయినా పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు’గా రెండేళ్ల క్రితం దిల్లీ హైకోర్టు అభివర్ణించింది. పౌరభద్రతకు గొడుగుపట్టేలా రూపొందించిన భవన నిర్మాణ నిబంధనల్ని ఆమ్యామ్యాల రుచి మరిగిన అధికార యంత్రాంగం అడ్డగోలుగా నీరుగారుస్తుంటే, కనీస రక్షణ కొరవడిన చోటల్లా మృత్యువు విలయ నర్తనం చేస్తూనే ఉంది. మొన్న మే నెల చివరివారంలో సూరత్‌లోని నాలుగంతస్తుల భవనంలో రాజుకొన్న అగ్గి- కౌమారప్రాయంలోని 22మంది విద్యార్థుల్ని బలిగొంది. 2017 డిసెంబరులో ముంబయిలోని కమలా మిల్స్ ప్రాంగణంలోని పైకప్పు పబ్బులో సంభవించిన అగ్ని ప్రమాదం 14మందిని కబళించింది. మొన్న ఆగస్టు మూడోవారంలో దేశ రాజధానిలోని విఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో అయిదో అంతస్తు దాకా మంటలు ఎగసి వైరాలజీ విభాగం దగ్ధమైపోయింది. ఇలా ఆసుపత్రులు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, వినోద కేంద్రాలు... వేటికీ మినహాయింపు లేని అభద్ర వాతావరణం దేశవ్యాప్తంగా వర్ధిల్లుతుండబట్టే రోజుకు దాదాపు 60మంది ప్రాణాల్ని అగ్ని ప్రమాదాలు హరించి వేస్తున్నాయి. 2010-’14 నడుమ దేశవ్యాప్తంగా లక్షా 12వేల అగ్ని ప్రమాదాల్లో లక్షా 13 వేలమంది అసువులు బాశారని కేంద్ర నేరగణాంక సంస్థ గణాంకాలే చాటుతున్నాయి. పట్టణీకరణతో పాటే ప్రమాదాలకు అనుకూల వాతావరణమూ విస్తరిస్తుండటం, దీటైన కార్యాచరణ పట్టాలకెక్కకపోవడం- అగ్నికి ఆజ్యంపోస్తున్నాయి.
ప్రభుత్వ భావనాల సంగతేంటి?
'సిద్ధంకండి... కసరత్తు చెయ్యండి... అనూహ్యంగా వచ్చే ప్రమాదాల్ని అరికట్టండి' అంటూ పటిష్ఠ అగ్నిమాపక వ్యవస్థలుగల అభివృద్ధి చెందిన దేశాలూ జనజాగృతి కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. 1995లో 445మంది పిన్నలూ పెద్దలూ సజీవ దహనమైన దబ్వాలీ (హరియాణా) ఉదంతం, 2004లో 94మంది పిల్లల్ని పొట్టనపెట్టుకున్న కుంభకోణం (తమిళనాడు) ఘోరం వంటివి గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్ని మెలిపెడుతున్నా అగ్ని ప్రమాదాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసే విషయంలో ప్రభుత్వాలెందుకో నాన్చుడు ధోరణితోనే వ్యవహరిస్తున్నాయి. అగ్నిమాపక సేవలు రాష్ట్రాల పరిధిలోని అంశం కాగా, రాజ్యాంగంలోని పన్నెండో షెడ్యూలు దాన్ని పురపాలక విధుల్లో భాగంగా చేర్చింది. భవన నిర్మాణ నిబంధనల్ని కచ్చితంగా అమలుచేసే నిబద్ధత లేని అధికారగణం, పెరుగుతున్న అవసరాలకు దీటుగా అగ్నిమాపక సేవలను విస్తరించే విత్త సత్తువ లేని పాలకగణం- ఉమ్మడిగా పౌరభద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రైవేటు బిల్డింగులే కాదు ప్రభుత్వ భవనాల్లోనూ అగ్ని ప్రమాద నిరోధక ఏర్పాట్లు అంతంత మాత్రమే కావడం అవ్యవస్థ ఎంతగా మేటవేసిందో స్పష్టీకరిస్తోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు, పార్లమెంటు భవనాల సంగతేమిటంటూ 2014లో కేంద్ర సమాచార సంఘం సూటిగా ప్రశ్నించింది. జాతీయ భవన నిర్మాణ స్మృతిని దేశవ్యాప్తంగా తు.చ. తప్పక పాటించేలా తగు ఆదేశాలివ్వాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై నిరుడు జులైలో సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ‘అవినీతి రూపుమాసిపోవాలని ఆదేశిస్తే- అవుతుందా?’ అంటూ స్వీయ పరిమితుల్ని ఇటీవల ప్రస్తావించిన న్యాయపాలిక- ఈ విషయంలోనూ ఏం చేయగలుగుతుంది? భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అవినీతి రహితమై నిబంధనల్ని కచ్చితంగా పాటించడం, అగ్నిమాపక వ్యవస్థను బలోపేతం చెయ్యడం, అగ్ని ప్రమాదాలపై జనచేతన పెంచడం- ముప్పేటగా అమలైనప్పుడే- ప్రాణాంతక అగ్నిపరీక్షల నుంచి దేశానికి విముక్తి!
ఇదీ చూడండి:ఈటీవీ భారత్‌ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు