ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగాసస్'పై కేంద్రానికి నివేదిక సమర్పించింది వాట్సాప్. పెగాసస్.. 121 మంది భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
తాజా వివరణపై పూర్తి వివరాలు వెలువరించలేదు వాట్సాప్. అయితే మే నెలలోనే స్పైవేర్‌పై సమాచారం అందించినట్టు.. అనంతరం సెప్టెంబర్‌లో రెండోసారి ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపింది. సుమారు 121 మంది భారతీయ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లిందని అధికార వర్గాల దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
గత సమాచారం అసంపూర్ణం..
భారతీయ విలేకరులు, మానవహక్కుల కార్యకర్తలను ఇజ్రాయెల్ స్పైవేర్ లక్ష్యంగా చేసుకున్న అంశంపై వాట్సాప్ నుంచి నివేదిక అందినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దానిపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
గతంలో వాట్సాప్ నుంచి కొంత సమాచారం అందిందని ఐటీశాఖ వెల్లడించింది. కానీ ఆ సమాచారం పూర్తి అసంపూర్ణంగా, పూర్తి సాంకేతిక పరిభాషతో ఉన్నట్లు పేర్కొంది.