అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఎట్టకేలకు తమిళనాడు చేరుకున్నారు. బెంగళూరు నుంచి 23 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చెన్నైకి వచ్చిన ఆమెకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు అభిమానులు. ఇకపై ఆమె తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయని తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్.. శశికళకు ఫోన్ చేశారని ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు. శశికళ ఆరోగ్యంపై రజనీ ఆరా తీశారని చెప్పారు.
చరిత్రలో మరే నేతకు లేని రీతిలో శశికళకు కర్ణాటక, తమిళనాడు అభిమానులు ఘనస్వాగతం పలికారని ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు దినకరన్. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్‌లోని రెండు స్థానాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. శశికళ పోటీ చేసే విషయంపై న్యాయసలహా తీసుకుని నిర్ణయం చెబుతామన్నారు.
" అన్నాడీఎంకేకు చెందిన ఎంతో మంది నాయకులు నాతో మాట్లాడారు. వీటిపై నేను బహిరంగంగా మాట్లాడలేను. అన్నాడీఎంకేతో పాటు ఏఎంఎంకే కార్యకర్తలు శశికళకు ఘన స్వాగతం పలికారు. రజనీకాంత్ ఫోన్ చేసి శశికళ ఆరోగ్యంపై ఆరా తీశారు"
-దినకరన్ ట్వీట్.
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను జనవరి 27తో పూర్తి చేసుకున్నారు శశికళ. కరోనా, ఇతర అనారోగ్య సమస్యలో బాధపడిన ఆమె కొద్ది రోజుల క్రితం వరకు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అక్కడ వారం రోజుల క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం చెన్నైలోని ఆమె సోదరి కూతురి నివాసానికి మంగళవారం చేరుకున్నారు.