లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి ఎంత ఉండాలో చెప్పాలంటూ రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల కమిషన్ కోరింది. ఈ మేరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖ పంపింది. భవిష్యత్తులో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితిపై తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించింది.
ప్రస్తుతం అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులపై పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో వ్యయ పరిమితి సంబంధిత సమస్యల పరిశీలనల కోసం ఈ ఏడాది అక్టోబరులో ఈసీ ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఓటర్ల సంఖ్య పెరుగుదల, వ్యయ ద్రవ్యోల్బణ సూచీలో వృద్ధి తదితర అంశాల దృష్ట్యా అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితిని సవరించే అంశంపై ఈ కమిటీ పరిశీలన చేయనుంది. 2014 తర్వాత అభ్యర్థుల వ్యయ పరిమితిని ఈసీ సవరించలేదు. '2019 నాటికి ఓటర్ల సంఖ్య 83.4కోట్ల నుంచి 91 కోట్లకు, ప్రస్తుతం 92.1కోట్లకు పెరిగింది. అంతేగాక, వ్యయ ద్రవ్యోల్బణ సూచీ కూడా 2019 నాటికి 220 నుంచి 280కి, ప్రస్తుతం 301కి పెరిగింది' అని కమిటీ నియామకం సందర్భంగా ఈసీ పేర్కొంది. అయినా వ్యయ పరిమితిని సవరించలేదని వెల్లడించింది.