అందరి దృష్టి మహాబలిపురం వైపే. రెండు రోజుల పాటు జరగనున్న కీలక భేటీపైనే అందరి చర్చ. ప్రపంచంలోనే బలమైన శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతలు సమావేశం కావటమే కాదు... ఇటీవల చోటుచేసుకున్న అనేక పరిణామాలు వీరి మాటామంతీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. అధికారికంగా ఎలాంటి అజెండా లేకపోయినా.. ఈ చారిత్రక ఇష్టాగోష్ఠిలో చాలా విషయాలే చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఉన్నతస్థాయి సమావేశం గతేడాది జరిగిన వుహాన్ భేటీ తరహాలోనే ప్రశాంతంగా ఫలవంతంగా సాగిపోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నాయి. ఇరువురి నేతల అనధికార అజెండాపై దౌత్య వర్గాలు ఏం అభిప్రాయ పడుతున్నాయి? చర్చలు ఎలా సాగే అవకాశాలు ఉన్నాయి?
సర్వం సిద్ధం
భారత్ - చైనా దేశాధినేతల మధ్య కీలకమైన రెండవ ఇష్టాగోష్ఠికి సర్వం సిద్ధమైంది. దిల్లీ-బీజింగ్ మధ్య మైత్రిబంధం కోసం మహాబలిపురం వేదికగా రెండు రోజుల పాటు ఈ సంప్రదింపులు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలను పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించటం, పరస్పర సహకారమే లక్ష్యంగా 2018 ఏప్రిల్‌లో వూహాన్‌లో మొదటి వ్యూహాత్మక భేటీ జరిగింది.
అదే స్ఫూర్తితో మలివిడత సమావేశానికి ఇరుదేశాల అధినేతలు సిద్ధమైనట్లు దౌత్యవర్గాలు చెబుతున్నాయి. కొంతకాలంగా ముఖ్య అంశాలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న స్తబ్దతపైనా ఇక్కడ స్పష్టత రావొచ్చని చాలామంది ఆశిస్తున్నారు.
చర్చలో ఇవే ప్రధానాంశాలు!
అధికారికంగా ఇదీ అని అజెండా లేకపోవచ్చు. కానీ ప్రపంచంలోనే తిరుగులేని శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతలు భేటీ అంటే ఏమీ చర్చకు రాకుండా ఎందుకు ఉంటాయి? దౌత్య వర్గాల నుంచి ఉన్న సమాచారం ప్రకారమైతే... ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయ సాధనే మహాబలిపురం సమావేశం ముఖ్య ఉద్దేశం.
అభివృద్ధి కోణంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై పరస్పర సంప్రదింపులు జరగనున్నాయి. భారత్, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖల ప్రకటనల సారాంశం కూడా అదే. కాకపోతే వూహాన్‌లానే ఇక్కడా ఎలాంటి ఒప్పందాలు, నిర్ణయాలైతే ఉండవు.
సమస్యలు.. పరిష్కారాలు
ద్వైపాక్షిక అంశాలతో పాటు వాణిజ్య సమతూకం, సరిహద్దు వివాదాల పరిష్కారం, పరస్పర విశ్వాసం పెంపొందించేందుకు కార్యాచరణ, అఫ్గానిస్థాన్, ఇండో-పసిఫిక్ విధానం, ఉగ్రవాదం, ఇతర అంతర్జాతీయ వాణిజ్యాంశాలు మోదీ - జిన్‌పింగ్ భేటీలో ప్రధానంగా చర్చకు వస్తాయని సమాచారం. వీటికి సంబంధించి దేశాధినేతలతో పాటు ఉన్నత స్థాయి బృందం మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా సాఫీగానే సాగిపోతుందా? ఒకరు చెప్పిన వాదనకు మరొకరు వెంటనే సరే అని తలూపుతారా అనేది వేచి చూడాల్సిన విషయం.
నిజానికి మిగిలినవి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మోదీ - జిన్‌పింగ్ భేటీ సందర్భంగా కశ్మీర్‌పై ఎవరి వైఖరి ఎలా ఉంటుందనే విషయంపై ఇంకాస్త ఎక్కువ ఆసక్తి నెలకొంది. కశ్మీర్‌పై ఆగస్టులో మోదీ సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయంపై చైనా బహిరంగంగానే ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తోంది.
ఆ నేపథ్యంలోనే దేశంలో అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం ప్రభావం పొరుగు దేశంతో సంబంధాలపై పడకుండా చూసేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని ప్రయత్నాలు జరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి జయ్శంకర్ చైనా పర్యటన చేపట్టారు. లద్దాఖ్‌లో పాలన నియంత్రణ భారత్ చేతిలోనే ఉండాలనేది శాసన పరమైన నిర్ణయ లక్ష్యమని జయశంకర్ పేర్కొన్నారు.
మారని వైఖరి..
అయితే జయ్శంకర్ చైనా పర్యటన, వివరణల తర్వాత కూడా కశ్మీర్ విషయంలో చైనా తన వైఖరి మార్చుకోలేదు. భారత్ చర్య ఆమోదనీయం కాదని, ఏకపక్షంగా దేశీయ చట్టంలో మార్పులు చేసుకోవడం ద్వారా తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని చైనా విదేశాంగ కార్యాలయం విమర్శించింది. తన చిరకాల స్నేహితుడు పాక్ కోసం ఐరాస భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని చర్చకు ప్రతిపాదించింది.
కాకపోతే బహిరంగ చర్చ కాకుండా, అంతర్గత సంప్రదింపులకే అనుమతి లభించింది. ఇటీవల చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌ను విస్మరించి మరీ పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి రాజకీయ, సైనిక నేతలను కలిశారు.
అడ్డంకులను దాటుకుని...
ఈ తరుణంలోనే అసలు మహాబలిపురం భేటీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కానీ అవన్నీ అధిగమించి సమావేశానికే మొగ్గుచూపారంటే వాటిని మించి... చర్చించాల్సిన విషయాలు ఉన్నాయనే అర్థం చేసుకోవచ్చు.
ఇదే సమయంలో కశ్మీర్ సమస్య భారత్, పాకిస్థాన్‌లే పరిష్కరించుకోవాలంటూ జిన్‌పింగ్ పర్యటనకు ముందుగా చైనా ప్రకటించింది. ఇటీవల ఐరాసలో ప్రస్తావించిన అంశాల జోలికి వెళ్లలేదు. అందుకే... కశ్మీర్ అంశంపై నెలకొన్న అనుమానపు నీడల్ని దాటుకుంటూ.. పాకిస్థాన్, సీమాంతర ఉగ్రవాదం అంశాలపై భిన్నాభిప్రాయాల్ని దాటి భారత్, చైనా సంబంధాల్లో ముందడుగేయటం ఇరుదేశాల ముందున్న అతిపెద్ద సవాల్.
ఇదీ చూడండి: మోదీ-జిన్‌పింగ్ భేటీ కోసం అందంగా ముస్తాబైన మహాబలిపురం