ETV Bharat / bharat

భూఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదమేదీ? - ప్రార్థన మందిరాల పేరిట ఆక్రమణలపై ఉక్కుపాదమేదీ?

దేశవ్యాప్తంగా భూఆక్రమణలు, అక్రమ నిర్మాణాల దందా విచ్చలవిడిగా సాగిపోతోంది. ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నలభై శాతం దాకా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వాటిపైనే ఉన్నాయంటూ 'ఈ విషయంలో ఏదైనా విధానం ఉందా?' అని తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. 2010లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మించిన ప్రార్థన మందిరాలు 6,707 ఉంటే, అందులో మూడోవంతు 2,204 జంటనగరాల్లోనే పోగుపడ్డాయి.

What about the encroachments in the name of prayer halls?
ప్రార్థన మందిరాల పేరిట ఆక్రమణలపై ఉక్కుపాదమేదీ?
author img

By

Published : Feb 28, 2020, 7:32 AM IST

Updated : Mar 2, 2020, 8:00 PM IST

చట్టబద్ధ పాలనను ఎద్దేవా చేస్తూ దేశవ్యాప్తంగా భూఆక్రమణలు, అక్రమ నిర్మాణాల దందా విశృంఖలంగా సాగిపోతోంది. కబ్జాసురులకు భిన్న ప్రభుత్వ విభాగాలవారికి మధ్య బిగిసిన అవినీతి బాంధవ్యం పట్టణ ప్రణాళికల ఔచిత్యాన్ని ప్రశ్నార్థకం చేసి, నగర జీవనాన్ని నరకతుల్యంగా మారుస్తోంది. ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి... నలభైదాకా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వాటిపైనే ఉన్నాయంటూ 'ఈ విషయంలో ఏదైనా విధానం ఉందా?' అని తెలంగాణ హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. ప్రభుత్వం, ప్రజలకు చెందిన బహిరంగ ప్రదేశాల్లో అనుమతుల్లేకుండా అక్రమంగా ప్రార్థనా మందిరాల్ని నిర్మిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై కన్నెర్ర చేసింది. హైదరాబాద్‌లోని మాధవపురి హిల్స్‌లో పార్కుకోసం కేటాయించిన 9,860 చదరపు అడుగుల స్థలంలో అక్రమంగా ఆలయం నిర్మించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ హైకోర్టు వ్యక్తీకరించిన ధర్మాగ్రహం- దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అవ్యవస్థపై ఛర్నాకోలా లాంటిది.

2,204 జంట నగరాల్లోనే..

2010లో చివరిసారిగా జరిగిన సర్వే మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మించిన ప్రార్థన మందిరాలు 6,707 ఉంటే, అందులో మూడోవంతు 2,204 జంటనగరాల్లోనే పోగుపడ్డాయి. వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించి 2010లోనే రెవిన్యూ శాఖ 262 నెంబరు జీఓ తెచ్చినా, దానికి ప్రభుత్వాలు ఏ మేరకు కట్టుబాటు చాటాయన్న సమాచారమే కొరవడింది. అంతకుమించి, సరైన సమీక్షా అటకెక్కింది! మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, మతం పేరిట ఎవరూ అక్రమ నిర్మాణాలు చేపట్టరాదన్న ఓ విధానం ఉండి తీరాల్సిందేనన్న హైకోర్టు వ్యాఖ్య- ‘సుప్రీం’ తీర్పుల స్ఫూర్తికి గొడుగుపడుతోంది. కులమతాతీతంగా రాజస్థాన్‌లో కూల్చివేతలు సాగాయన్న న్యాయపాలిక- ఇక్కడా అలాంటి కఠిన విధానాన్నే అభిలషిస్తోంది. 1964 తరవాత నిర్మించిన 55 మత కట్టడాల్ని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చేసింది. దేవుడి పేరిట సాగే అక్రమాల నిరోధానికి హైకోర్టు ఆశిస్తున్నదే ఆ కచ్చితత్వాన్ని!

రోడ్లపై వెలసిన ప్రార్థన మందిరాలు సహా అక్రమ కట్టడాలన్నింటినీ కూలగొట్టాలని 2006 మే నెలలో గుజరాత్‌ హైకోర్టు అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్లను ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు- ఆ తరహా అక్రమ కట్టడాల్ని దేశవ్యాప్తంగా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని 2009 జులై 31న సొలిసిటర్‌ జనరల్‌కు సూచించింది. ప్రజోపయోగ ప్రాంతాల్లో మతపర నిర్మాణాల సమస్యపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి జరిపిన భేటీ ఏకాభిప్రాయానికి వచ్చి, ఆ సంగతినే కోర్టుకు నివేదించింది. ఆ మేరకు రహదారులు, పార్కుల వంటి ప్రజోపయోగ ప్రాంతాల్లో గుడి, చర్చి, మసీదు, గురుద్వారాల వంటివేవీ నిర్మించరాదంటూ 2009 సెప్టెంబరు చివర్లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. అప్పటికే ఉన్న కట్టడాలకు సంబంధించి ఆయా కేసులవారీగా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలనీ సూచించింది.

నేతల విగ్రహాలూ...

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గుడికి, మసీదుకు మధ్య ఎలాంటి వ్యత్యాసమూ తాము చూపించడం లేదన్న న్యాయపాలిక- 2013 నాటి ఆదేశాల్లో నడిరోడ్లపై నేతల విగ్రహ ప్రతిష్ఠాపనలూ కూడదని స్పష్టీకరించింది. యూపీలో మొత్తం 45,152 మతపర కట్టడాల్ని అక్రమంగా నిర్మిస్తే, వాటిలో 27 వేలకు పైగా మందిరాల్ని క్రమబద్ధీకరించాలని అప్పట్లో మాయావతి ప్రభుత్వం నిర్ణయించింది. తన ఆదేశాల అమలుతీరుపై రాష్ట్రాల నుంచి స్థాయీ నివేదికలు తెప్పించుకొన్న సుప్రీంకోర్టు 2018లో కేసుల్ని ఆయా రాష్ట్రాల హైకోర్టులకే బదలాయించింది. మురుగు కాల్వలు, పాన్‌డబ్బాకొట్ల పక్కన ప్రార్థన మందిరాలు కట్టడం దేవుణ్ని అవమానించడమేనంటూ, ఆ రూపేణా జరుగుతున్న ఆక్రమణల దందాను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు తీర్మానిస్తోంది. తెలంగాణ హైకోర్టు గళంలోనూ ఆ తపనే ప్రతిధ్వనిస్తోంది!

భారత్​ ప్రథమం...

ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ పోటెత్తుతున్న దేశాల జాబితాలో ఇండియా ప్రథమ పంక్తిలో ఉంది. 2030నాటికి పట్టణ జనాభా 60కోట్లకు పైబడి, 2050నాటికి 85 కోట్లకు మించి పెరగనుందన్న అంచనాలకు దీటుగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు ప్రయాసపడుతున్న తరుణమిది. జీవితకాల కష్టాన్ని ముడుపు కట్టి, తలదాచుకొనే గూడుకోసం పరితపించే అభాగ్యుల కలల్ని నెరవేరుస్తామంటూ అక్రమంగా వెలుస్తున్న లే అవుట్లు, బహుళ అంతస్తుల రూపేణా అవినీతి విశ్వరూపాన్ని కళ్లకు కడుతున్నాయి. బిల్డింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలను అనుమతించడం కాసులు కురిపించే వ్యాపారంగా మారిందని దిల్లీ హైకోర్టు లోగడే నిష్ఠురసత్యం పలికింది.

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 14 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలపై ఏసీబీ అధికారులు పది రోజులనాడు జరిపిన దాడిలో- ఎలాంటి ప్లాను లేకుండానే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేస్తున్నారన్న వాస్తవం వెలుగు చూసింది! క్రమబద్ధీకరణ పేరిట అక్రమ నిర్మాణాలపై జరిమానా విధించి అనుమతించడం సమాజ క్రమబద్ధ అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందంటూ నిరుడు మే నెలలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు- అక్షరాలా మెచ్చుతునకలు! కలెక్టర్‌ సారథ్యంలో జిల్లాకో అప్రూవల్‌ కమిటీని నియమించి, ఎవరైనా అక్రమ లే అవుట్‌ వేస్తే మూడేళ్లు జైలుశిక్ష విధించనున్నట్లు తెలంగాణ కొత్త మున్సిపల్‌ చట్టం నిర్దేశిస్తోంది. ఆ విధంగా చట్టాలకు సానపట్టడం ద్వారా అక్రమ లే అవుట్ల కట్టడితోపాటు, కబ్జాలుచేసి మరీ నిర్మించే ప్రార్థనాలయాల దందా మీదా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. చట్టాన్ని అతిక్రమిస్తే ఆ దేవుడూ కాపాడలేడన్న భీతిని అక్రమార్కులు, ఆక్రమణదారుల గుండెల్లో పుట్టించాలి!

Last Updated : Mar 2, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.