పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్న ఆ దేశం.. ఇప్పుడు మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఇప్పటి వరకు పీఓకే తమదేనని చెప్పుకొంటూ వస్తున్న పాక్.. తాజాగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని తమ భూభాగాలుగా చూపిస్తూ కొత్త రాజకీయ చిత్రపటాన్ని మంగళవారం విడుదల చేసింది. గుజరాత్‌లోని జునాగఢ్, మన్వదార్, సర్ క్రీక్‌లను కూడా ఆ మ్యాప్‌లో చూపించింది. ఆర్టికల్ 370 రద్దుకు రేపటికి ఏడాది పూర్తవుతున్న వేళ ఒక్కరోజు ముందు తన వైఖరిని మ్యాప్ రూపంలో తెలియజేసింది. ఇప్పటికే ఆగస్టు 5న బ్లాక్‌డే పాటించాలని నిర్ణయించింది.
కొత్త చిత్రపటం ఆవిష్కరించిన సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఇది పాకిస్థాన్ ప్రజల ఆశయానికి అద్దం పడుతోందన్నారు. కేబినెట్ ఆమోదించిన ఈ చిత్ర పటాన్ని ఇవాళ ప్రపంచం ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని పాఠ్యాంశాల్లో దీన్నే వాడాలని సూచించారు. గతేడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ మ్యాప్‌ను తీసుకొచ్చినట్లు తన వైఖరిని తానే బయట పెట్టుకున్నారు.
భారత్ మండిపాటు
ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన పాకిస్థాన్ కొత్త మ్యాప్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే పాక్ ఇలా చేస్తోందని మండిపడింది. జమ్ముకశ్మీర్, గుజరాత్ భూభాగాలను పాక్ తమవిగా చూపడం అసంబద్ధమని తేల్చిచెప్పింది. ఈ చర్య హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. పాక్ నూతన మ్యాప్ న్యాయపరంగా చెల్లుబాటు కాదని.. అంతర్జాతీయ విశ్వసనీయత లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రయత్నాలు సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతిచ్చే విషయాన్ని వాస్తవికంగా నిర్ధరిస్తున్నాయని తెలిపింది.