కర్ణాటక మంత్రి బి. శ్రీరాములు కుమార్తె వివాహం మార్చి 5న జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త రవికుమార్‌ను శ్రీరాములు కుమార్తె రక్షిత పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 27నుంచి 9 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ వివాహ వేడుకలో నేడు మెహందీ కార్యక్రమం జరుగుతోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ భారీ పెళ్లికి మంత్రి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప వంటి రాజకీయ, సినీ ప్రముఖులు సహా లక్షమందికి పైగా ఈ వివాహానికి హాజరుకానున్నారు. అట్టహాసంగా.. భూమిపైనే స్వర్గముందా అన్న రీతిలో జరుగుతున్న ఈ వివాహానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.
పెళ్లి కార్డు ప్రత్యేక ఆకర్షణ
వివాహ ఆహ్వాన పత్రికను ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. 'ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి' అనే ఇతివృత్తంతో ఈ పెళ్లికార్డును తీర్చిదిద్దారు. పసుపు కుంకుమ, సింధూరం, యాలకులతో ఆహ్వాన పత్రికను అలంకరించారు.
40 ఎకరాల విస్తీర్ణం..
బెంగళూరులోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ వివాహం జరగనుంది. హంపీలోని విరుపాక్ష ఆలయాన్ని పోలిన సెట్‌ను ఈ తంతు కోసం ప్రత్యేకంగా వేస్తున్నారు. ఇది నాలుగు ఎకరాల మేర ఉండనుంది. దేశ, విదేశాల నుంచి తెప్పించిన పువ్వులతో వివాహ ప్రాంగణాన్ని అలంకరిస్తున్నారు. ఇందుకోసం 2వందల మంది నిపుణులు శ్రమిస్తున్నారు. బాలీవుడ్, కర్ణాటకకు చెందిన కళాదర్శకుల నేతృత్వంలో పెళ్లి సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
అంబానీ ఫొటోగ్రాఫర్లు..
దీపిక పదుకొణె పెళ్లికి పనిచేసిన ఆర్టిస్టులు పెళ్లికుమార్తెకు మేకప్ చేయనున్నారు. ప్రముఖ డిజైనర్ సానియా సర్దారియా పెళ్లికుమార్తె దుస్తులను రూపొందించారు. ముఖేశ్ అంబానీ కుమార్తె వివాహానికి ఫొటోగ్రాఫర్లుగా పనిచేసిన జయరామన్ పిళ్లై టీమ్ వీడియోలు తీయనున్నారు.
పెళ్లి కుమారుడిని తీసుకొచ్చే వరపూజ కార్యక్రమానికి పాలెస్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నడ డాన్స్ మాస్టర్లు గురుకిరణ్, అఖిల పాజిమన్ను, సుహానా సయీద్ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
వంటవాళ్లు వెయ్యిమంది..
పెళ్లిలో వంటలు చేసేందుకు వెయ్యిమంది నిపుణులను పిలిపిస్తున్నారు. ఇప్పటికే 7వేలమంది కూర్చునే సామర్థ్యమున్న డైనింగ్ హాల్‌ను సిద్ధం చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రత్యేక వంటలను ఈ భారీ వివాహ వేడుకలో వడ్డించనున్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో బయటపడ్డ నకిలీ జీఎస్టీ బిల్లుల రాకెట్