గుజరాత్ వాసులను భయపెడుతున్న 'వాయు' తుపాను... దిశ మారి, పశ్చిమం వైపు ప్రయాణిస్తోందని వాతావరణశాఖ ప్రకటించింది. దిశ మారినా ఆ రాష్ట్రంపై తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై... తగిన చర్యలు చేపట్టాయి.
గుజరాత్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో 'వాయు' తుపాను ప్రభావం ఇలా ఉండనుంది...
కొంకణ్- గోవా:-
- కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
- పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని వాతావరణశాఖ సూచించింది.
సౌరాష్ట్ర- కచ్:-
- రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
- మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
గుజరాత్ ప్రాంతం:-
- నేడు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
- రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.
- ఈ ప్రాంతాల్లో వాతావరణశాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
మూతపడని సోమనాథ్ ఆలయం..
గుజరాత్ తీరం అల్లకల్లోలంగా మారినప్పటికీ సోమనాథ్ దేవాలయం మూతపడలేదు. ఉదయం నుంచి పూజలు జరిగాయి. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి భూపేంద్ర సిన్హా స్పందించారు. ప్రకృతి విపత్తులను ప్రకృతే నిలువరిస్తుందని వ్యాఖ్యానించారు. ఆలయంలో పూజలు కొనసాగుతున్నప్పటికీ... దర్శనానికి రావొద్దని భక్తులకు సూచించినట్టు తెలిపారు.