ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్, భారత్ బయోటెక్- కొవాగ్జిన్ టీకాలకు అనుమతులు లభించడంపై దిల్లీ ఎయిమ్స్ డెరెక్టర్ రణ్‌దీప్ గులేరియా హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు ఇది గొప్ప రోజు అని, నూతన సంవత్సరాన్ని ఇలా మొదలు పెట్టడం శుభపరిణామం అన్నారు. స్వదేశంలో తయారు చేసిన రెండు టీకాలు తక్కువ ధరకు అందుబాటులో ఉండటమే కాకుండా నిర్వహణ కూడా సులభమని చెప్పారు. వీలైనంత త్వరగా టీకా పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఏ వ్యాక్సిన్‌కైనా భద్రతే తొలి ప్రామాణికం అని గులేరియా స్పష్టం చేశారు. వివిధ దశల్లో వ్యాక్సిన్ సురక్షితమని తేలితేనే మానవులపై ప్రయోగాలు జరుపుతారని పేర్కొన్నారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని నిపుణులు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అత్యవసర అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
''కొత్తరకం కరోనా వ్యాప్తి చెందుతున్నందున అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే రెండు టీకాలకు అనుమతి ఇస్తున్నట్లు డీసీజీఐ స్పష్టంగా చెప్పింది. మూడో దశ క్లినియల్ ట్రయల్స్ యథావిధిగా కొనసాగుతాయి. వాటికి సంబంధించిన వివరాలను సంస్థలు సమర్పిస్తాయి. ఆ డేటా అందుబాటులోకి వచ్చాక టీకాల భద్రత, సమర్థతపై మరింత నమ్మకం ఏర్పడుతుంది. దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి అత్యవసర పరిస్థితి తలెత్తితే భారత్ బయోటెక్ టీకాను వినియోగిస్తాం. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎంత ప్రభావం చూపుతుందో తెలియనప్పుడు బ్యాకప్‌గా భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్ ఉపయోగపడుతుంది.''
- రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్.
28 రోజుల తర్వాత
వ్యాక్సిన్ సంబంధించి పలు సందేహాలపై ప్రజలకు స్పష్టతనిచ్చారు గులేరియా. టీకాను రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల విరామం తర్వాత రెండో డోసు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత 14 రోజులకు కరోనాను సమర్థంగా ఎదుర్కొనే స్థాయిలో యాంటీబాడీలు మానవశరీరంలో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కరోనా సోకిన వారు లక్షణాలు తగ్గాక రెండు వారాల తర్వాతే టీకా తీసుకోవాలని సూచించారు. 50 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక రోగాలున్న వారు తప్పని సరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: స్వదేశీ టీకాలతో కరోనా అంతానికి భారత్ సిద్ధం