నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని దేశ్‌నాయక్ దివస్‌గా తాము జరుపుకుంటున్నామని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. నేతాజీని దేశ్‌నాయక్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలిచేవారని అన్నారు. పరాక్రమ్ ఏంటని మమతా ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా బంగాల్లో భారీ ర్యాలీ నిర్వహించిన మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. శ్యామ్ బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు వేలాది మంది వెంట రాగా 6 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.
"జాతీయ ఆర్మీని సుభాష్‌చంద్రబోస్ ఏర్పాటు చేసినప్పుడు.. గుజరాత్, బంగాల్, తమిళనాడులోని ఎంతో మందిని భాగస్వాములను చేశారు. విభజించు-పాలించు విధానానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఇంతకుముందు ఏనాడు నేతాజీ జయంతిని కేంద్ర ప్రభుత్వం జరపలేదు."
-- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
నేతాజీ స్మారక చిహ్నాన్ని తాము నిర్మిస్తామని మమత తెలిపారు. దేశంలో నాలుగు రాజధానులు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతటి విశాల దేశంలో ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ తిరిగి ఏర్పాటు చేసి... నీతి ఆయోగ్, కమిషన్ సంయుక్తంగా పనిచేసేలా చూడాలని అన్నారు. ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేయడం సమంజసం కాదని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.