జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణకు పోరాటం చేయాలని భాజపాయేతర పార్టీలు నిర్ణయించాయి. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్(పీఏజీడీ) పేరిట ప్రజా కూటమిగా ఏర్పడిన నేతలు.. తొలిసారి శ్రీనగర్‌లోని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నివాసంలో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి భాజపా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. నెలరోజుల్లో ఓ పత్రం విడుదల చేయాలని నిర్ణయించారు.
తమ కూటమి భాజపాకు వ్యతిరేకమే తప్ప భారత్‌కు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టంచేశారు.
"ప్రజాకూటమిపై భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. జాతి వ్యతిరేకం అంటూ మాట్లాడుతోంది. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. వారి ఆరోపణలు అవాస్తవం. ఈ ప్రజాకూటమి దేశానికి వ్యతిరేకం కాదు కానీ భాజపాకు మాత్రం తప్పకుండా వ్యతిరేకమే. అందులో అనుమానమే లేదు. ఈ ప్రాంత రాజ్యాంగాన్ని రద్దుచేశారు. గత ఏడాది ఆగస్టు 5న దేశ విభజనకు, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు కోల్పోయిన హక్కులు తిరిగి దక్కాలన్నదే మా లక్ష్యం. అందుకోసం పోరాడతాం."
-- ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు
కూటమి నేతలంతా నవంబర్ 17న మరోసారి శ్రీనగర్‌లో సమావేశం కానున్నారు.
ఆలయంలో ఫరూక్
సమావేశానికి ముందు శ్రీనగర్‌లోని 'దుర్గా నాగ్' ఆలయాన్ని సందర్శించారు ఫరూక్. అక్కడ ఉన్న స్థానికులతో కలిసి కాసేపు మాట్లాడారు.