మూకుమ్మడి దాడులు, బృందాలుగా జరిగే నేరపూరిత కార్యకలాపాల నియంత్రణకు ఉద్దేశించిన మూకదాడుల నియంత్రణ బిల్లుకు బంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం భాజపా తటస్థంగా వ్యవహరించగా... విపక్ష పార్టీలు కాంగ్రెస్, సీపీఎంలు సమర్థించాయి.
"మూకదాడి ఒక సామాజిక దుశ్చర్య. మనమంతా ఈ చెడుకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసిరావాలి. మూకదాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టూ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా చట్టం చేయాలి. కేంద్రం ఈ దిశగా ఎలాంటి చట్టం చేయని కారణంగా బంగాల్లో ఈ చట్టం చేస్తున్నాం. మూకదాడులకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది."-బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
బాధిత వ్యక్తులకు రాజ్యాంగ హక్కులు కల్పించేందుకు, దాడుల నియంత్రణ, ఆయా సంఘటనల్లో పాల్గొన్న వారిపై చర్యలు.. అంశాలుగా రూపొందిందీ ప్రతిపాదిత చట్టం. బాధితుడు చనిపోతే... బాధ్యులైన వ్యక్తులకు కఠిన యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేందుకు ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా ఆమోదం తెలిపారు.
ఇదీ చూడండి: గణాంకాల గారడి.. ప్రగతికి ప్రాతిపదికలేమిటి?