దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ చట్టాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త చట్టాలను తక్షణమే రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. ఆయా పార్టీలపై భాజపా ఎదురుదాడికి దిగింది.
'అవి 'అంబానీ-అదానీ' చట్టాలు'
కొత్త వ్యవసాయ చట్టాల్ని 'అంబానీ-అదానీ చట్టాలు'గా అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
'రద్దు చేయండి.. లేదా గద్దె దిగండి'
కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజావ్యతిరేకమని విమర్శించారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. తక్షణమే ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవాలని, లేదా గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులను హరించిన భాజపా ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కులేదన్నారు. ఈ వ్యవహారంపై తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని.. కానీ మౌనంగా మాత్రం ఉండనని స్పష్టం చేశారు మమత.
ఇదీ చూడండి:- రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం
'చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే'
సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరను ఎప్పుడు తీసుకొస్తారనే విషయాన్ని రైతులకు కేంద్రం వివరించాలన్నారు. ఎమ్ఎస్పీతో రైతుల ఆదాయం రెండింతలు అవుతుందని అభిప్రాయపడ్డారు.
'రాజకీయ ఉనికి కోసమే'
విపక్షాలపై భాజపా ఎదురుదాడికి దిగింది. గతంలో తాము ఏం చేశామో మర్చిపోయి... రాజకీయ ఉనికి కోసమే కేంద్రం చర్యల్ని ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడింది.
'ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ఆంక్షలు ఎత్తేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన విషయాన్ని మర్చిపోయారా?' అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రైతులను తప్పుదోవ పట్టించారని.. కానీ ఇప్పుడు వారితో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు.
ఇదీ చూడండి:- 'ఖలిస్థాన్ ఉద్యమానికి, కశ్మీర్ ఉగ్రవాదానికి లింక్!'