దిల్లీ పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు కేవలం 6.28 శాతం ఓటింగ్ నమోదైంది.
ప్రజలు ఇలా...
పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు రద్దీగా కనిపించినా... ఎన్నికలు ప్రారంభమైన తొలి గంటలో 3.66 శాతం ఓటింగ్ నమోదైంది. షాకర్పుర్లో ఓ వరుడు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దిల్లీలోనే అతి పెద్ద వయస్కురాలు కలితారా మండల్.. గ్రేటర్ కైలాశ్‌లో ఓటు వేశారు. 110 ఏళ్ల వయస్సులో చక్రాల కుర్చీ సహాయంతో తన బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న కలితారాను అధికారులు అభినందించారు.
పౌర నిరసనలతో అట్టుడికి జామియా, షహీన్‌బాగ్ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భారీ భద్రత మధ్య ఓటర్లు క్యూలో ముందుకు సాగుతున్నారు.
మరోవైపు యమున విహార్‌లోని సీ-10 బ్లాక్ వద్ద ఈవీఎం మొరాయించింది. దీని వల్ల ఆ కేంద్రంలో ఓటింగ్ ఇంకా మొదలుకాలేదు. న్యూదిల్లీ నియోజకవర్గంలోని సర్దార్ పటేల్ విద్యాలయం(బూత్ నం. 114)లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఓటింగ్ నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ప్రముఖుల ఓట్లు...
సామాన్యులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. న్యూ దిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు వేసి సిరా చుక్క గుర్తును ప్రదర్శించారు.
అంతకుముందు తుగ్లక్ క్రిసెంట్ వద్ద విదేశాంగమంత్రి జయ్శంకర్, కరోల్‌బాగ్‌లో భాజపా నేత రామ్ మాధవ్, న్యూదిల్లీలో మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, గ్రేటర్ కైలాశ్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాయ్‌జల్ ఓట్ల పండుగలో పాల్గొన్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మోదీ ట్వీట్...
దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్యంలోని అతిపెద్ద హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.