శ్రీలంకలో తీరం దాటిన బురేవి తుపాను అక్కడి నుంచి కేరళ వైపుగా దూసుకొస్తోంది. తుపాను శుక్రవారం దక్షిణ కేరళలో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
కేరళలోని ఏడు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోనూ బురేవి తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేరళ సర్కార్... ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్ను మోహరించింది. ఇప్పటికే 2,849 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలిస్తోంది.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో...
తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నెల్లూరు జిల్లాలో... నెల్లూరు, గూడూరు, కోవూరు, నాయుడుపేట ప్రాంతాల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నెల్లూరు నగరంలో రహదారులు చెరువులను తలపిస్తుండగా.. కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా రైతులు ఆందోళనలో ఉన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలో..బురేవి ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పిచ్చాటూర్ మండలం.. గోడ్డేరు వాగుకు వరదనీరు పొంగిపొర్లుతోంది. కొత్తసివంగి, పాతశివంగి, గోళ్ళకండ్రిగ, సిద్ధిరాజుల కండ్రిగ, గోవర్దనగిరి గిరిజన కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి:ముంచుకొస్తున్న బురేవి- విస్తారంగా వర్షాలు