దిల్లీలోని పలుచోట్ల జరుగుతున్న సీఏఏ ఆందోళనల వెనక కుట్రకోణం దాగుందా? అంటే అవుననే అంటున్నాయి పలు విశ్వసనీయ వర్గాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే నిరసనలు ఉద్ధృతం చేశారని సమాచారం. నేడు చెలరేగిన ఘర్షణల్లో ఓ పౌరుడు, పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ఉన్నతాధికారికి గాయాలయ్యాయి. అల్లర్లను అణచేందుకు భారీగా బలగాలను మోహరించారు.
అయితే దిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
"దిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో సరిపడ బలగాలు ఉన్నాయి."
-అజయ్ భల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి
ఈశాన్య దిల్లీ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తెలిపారు.
ఇదీ జరిగింది..
ఈశాన్య దిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పుర్, బాబర్పుర్లలో రెండురోజులుగా పౌరవ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. సీఏఏ అనుకూల వర్గాలు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు జరిగాయి. నేడు ఆందోళనకారులు రెండిళ్లకు నిప్పు పెట్టారు. జాఫ్రాబాద్, మౌజ్‌పుర్, బాబర్‌పుర్ మెట్రో స్టేషన్లను మూసేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళనకారులు చేసిన రాళ్లదాడిలో రతన్‌లాల్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పౌరుడు మృతి చెందాడు. డీసీపీ అమిత్‌శర్మకు గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు సంయమనం వహించాలని, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని కోరారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు.
ఇదీ చూడండి: 'నమస్తే ట్రంప్' నినాదాలతో మారుమోగిన మోటేరా స్టేడియం