ఛత్తీస్‌గఢ్‌లో వర్షాకాల ఆరంభంలోనే పిడుగులు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జష్పూర్ జిల్లాలో పిడుగుపాటుతో ఓ మహిళ, ఇద్దరు పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా 'ప్రాథమిక చికిత్స' పేరిట గంటల పాటు పేడలో కప్పి పెట్టారు గ్రామస్థులు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగు పడి గాయపడినవారిని ఆవుపేడలో కప్పితే గాయాలు వాటంతటవే తగ్గిపోతాయని, దోషాలు తొలిగిపోతాయని వారి నమ్మకం. కానీ, గంటల తరబడి పేడలో కప్పి ఉంచినా క్షతగాత్రులకు గాయాలు తగ్గకపోగా.. నొప్పి తీవ్రమైంది. దీంతో, బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ ఆసుపత్రిలో వైద్యుడికి కరోనా సోకిందని ఆ దవాఖానా మూతపడింది.
గత్యంతరం లేక రాయ్‌గఢ్ జిల్లాలోని లైలుంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: 80సార్లు ఉతికినా వైరస్‌ను అడ్డుకునే పీపీఈ కిట్!