హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న తాషిగాంగ్ అనే చిన్న గ్రామంలో తొలిసారిగా కుళాయి ద్వారా తాగు నీరు సౌకర్యాన్ని కల్పించారు. దీంతో జల్ జీవన్ మిషన్‌లో భాగంగా.. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న గ్రామానికి తాగు నీటి సౌకర్యం కల్పించినట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు.
భారత్-చైనా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. శీతాకాలంలో మంచు కురవడం వల్ల ఆరు నెలల పాటు ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం తెగిపోతుంది. మంచును కరిగించి నీరు తాగాల్సిన పరిస్థితి ఇక్కడ ఉండేదని షేకావత్ వెల్లడించారు. తాషిగాంగ్, చిచామ్లలో భౌగోళిక పరిస్థితుల కారణంగా పంపు నీటిని ఇంత ఎత్తుకు తీసుకెళ్లడం పెద్ద సవాలు అని పేర్కొన్నారు.
'ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని తాషిగాంగ్ గ్రామంలో మొదటి ట్యాప్ కనెక్షన్ స్థాపించాం. ఈ ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ బృందానికి హృదయపూర్వక అభినందనలు' అని ట్వీట్ చేశారు షెకావత్.
అయితే స్పితి లోయ జనాభా 31,564. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంది.
ఇదీ చూడండి: దిల్లీలో తీవ్రస్థాయికి రెండో దశ కరోనా: కేజ్రీవాల్